Peddapalli: అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా రక్షాబంధన్ అంటేనే ఇట్టే వాలిపోతారు. తమ సోదరులకు రాఖీ కట్టాలని ఆరాటపడుతుంటారు. అందరిలాగే ఓ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా పుట్టింటికి వెళ్ళింది. అయితే అత్యంత విషాదకర రీతిలో మృతదేహానికి రాఖీ కట్టాల్సి వచ్చింది. హృదయం ద్రవించే ఈ ఘటన చూసినవారికి కళ్ళు చెమర్చాయి. ఈ విషాద ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కన్నయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లెలు గౌరమ్మ ఇంటికి వచ్చింది. అప్పటిదాకా చెల్లెలితో సంతోషంగా గడిపిన కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికే మృతి చెందాడు. ఈ హఠాత్ పరిణామంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
సోదరుడికి రాఖీ కట్టేందుకు ఎంతో ఆశతో వచ్చిన గౌరమ్మ షాక్ కు గురైంది. మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించింది. అంతటి విషాదంలోనే సోదరుడి చేతికి రాఖీ కట్టింది. ఈ ఘటన చూసిన అక్కడున్నవారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని చూసిన వారంతా రోదించారు. కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.