
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో వైరస్ విజృంభణ తగ్గుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తూ కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. నిన్న ఎయిమ్స్ వైద్యులు జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు.
అయితే ఇదే సమయంలో కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కష్టమేనని వాళ్లు వెల్లడించారు. వచ్చే సంవత్సరం ప్రజలకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ ప్రకటన చేశారు.
ఇందుకోసం మెక్ గిల్ పరిశోధకులు అధ్యయనం కూడా నిర్వహించారు. 2021 నాటికి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని అమెరికా చెబుతోందని కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రయోగశాలల్లో జరిగే పరీక్షల్లో కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉందని అందువల్లే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి లేట్ అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి వల్ల దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ ఇప్పట్లో రావడం కష్టమే అని వస్తున్న వార్తలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తూ ఉండటం గమనార్హం.