Khammam Husband And Wife: పెళ్ళంటే కలకాలం కలిసి ఉంటామని చేసుకునే ఒడంబడిక. భార్య అంటే నచ్చి తెచ్చుకునే ఒక కానుక. భర్త అంటే జీవితాంతం నిలిచి ఉండే ఒక తోడు. పిల్లలంటే మోయాలనిపించే బరువు. కుటుంబం అంటే ఒక బాధ్యత. ఇన్ని అనుబంధాల మధ్య మనుషులు బతుకుతుంటారు కాబట్టి భారతదేశాన్ని వసుదైక కుటుంబం అంటారు. కానీ అలాంటి కుటుంబాల్లో చిచ్చులు రేగుతున్నాయి. వివాహేతర సంబంధాలు సంసారాలను చిన్నా భిన్నం చేస్తున్నాయి. అగ్ని సాక్షిగా నడిచిన ఏడు అడుగులు, వేదమంత్రాల సాక్షిగా కట్టిన మూడు ముళ్ళు.. అంతలోనే బీటలు వారుతున్నాయి. పరాయి మోజులో హత్యలకు తెగించేందుకు వెనకాడని పరిస్థితులు నెలకొంటున్నాయి.
ఇంజక్షన్ ఇచ్చి హతమార్చిన కేసులో
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం, వల్లభి గ్రామాల సమీపంలో మూడు రోజుల క్రితం జమాల్ సాహెబ్ అనే వ్యక్తి మరో వ్యక్తికి లిఫ్ట్ ఇస్తే అతడు విషాన్ని కలిపిన ఇంజక్షన్ ను వెనుక నుంచి పొడిచి పారిపోయాడు. విషం మొత్తం క్షణాల్లో శరీరం మొత్తం వ్యాపించి అతడు వెంటనే కన్నుమూశాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విస్తు పోవడం పోలీసుల వంతయింది. చింతకాని మండలానికి చెందిన జామాల్ సాబ్ తాపీ మేస్త్రి గా పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. భార్య వ్యవసాయ పనుల్లో మేస్త్రిగా పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో నాట్లు వేసేందుకు తోటి కూలీలను తీసుకొని ఆటోలో వెళుతూ ఉంటుంది. నేపథ్యంలో ఆటో డ్రైవర్ కు ఆమెకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన జమాల్ సాబ్ పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, అతన్ని హతమార్చాలని జమాల్ సాబ్ భార్య, ఆటో డ్రైవర్ ఓ పన్నాగం పన్నారు. ఇందుకు ఓ ఆర్ఎంపి, ట్రాక్టర్ డ్రైవర్ సహాయం తీసుకున్నారు.
ఎలా చంపారంటే
జమాల్ సాబ్ తన పెద్ద కూతుర్ని ఎన్టీఆర్ జిల్లా గండ్రాయికి ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఆమెను చూసేందుకని స్వగ్రామం నుంచి బైక్ మీద బయలుదేరి వెళ్ళాడు. ఈ విషయం జమాల్ సాబ్ భార్య ద్వారా తెలుసుకున్న ఆమె ప్రియుడు .. ఆర్.ఎం.పి, ట్రాక్టర్ డ్రైవర్ కు చెప్పాడు. దీంతో ఆ ముగ్గురు జమాల్ సాబ్ వెళ్లే మార్గంలో వేచి ఉన్నారు. ముగ్గురు నెంబర్ ప్లేట్ లేని బైక్ మీద ప్రయాణించి అతని కోసం ఎదురుచూస్తున్నారు. ఈ లోగానే జమాల్ సాబ్ బైక్ మీద వస్తూ కనిపించాడు. ముందుగానే విషపు ఇంజక్షన్ సిద్ధం చేసుకున్న ఆర్.ఎం.పి ఒక మాస్క్ ధరించి.. బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ దాక లిఫ్ట్ ఇవ్వండి అంటూ చేయి అడ్డం పెట్టాడు. ఇది నిజమే అనుకొని జమాల్ సాబ్ లిఫ్ట్ ఇచ్చాడు. కొంత దూరం వెళ్లగానే ఆ ఇంజక్షన్ ను జమాల్ సాబ్ కాలి తుంటి భాగంలో కుచ్చాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆర్ఎంపి బైక్ మీద నుంచి దూకి పారిపోయాడు. ఆ ఇంజక్షన్ ను, మాస్క్ ను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. పోలీసులకు సవాల్ గా మారింది. భిన్న కోణాల్లో దర్యాప్తు చేశారు.
పట్టించిన సీసీ కెమెరాలు
ఈ కేసు సవాల్ గా మారడంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో సిసి ఫుటేజ్ లను పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని బైక్ మీద ప్రయాణించి.. జమాల్ సాబ్ రాగానే అందులో ఒక అతను లిఫ్ట్ అడిగి బండి ఎక్కి ఇంజక్షన్ గుచ్చి పారిపోయినట్టు గుర్తించారు. హత్య జరిగిన ప్రాంతంలో సెల్ఫోన్ సిగ్నళ్ళ ఆధారంగా ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. అయితే ఒక నెంబర్ నుంచి మాత్రం జమాల్ సాబ్ భార్యకు తరచూ ఫోన్ కాల్స్ వెళ్లడం గమనించారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంజక్షన్ గుచ్చిన ఆర్ఎంపి పరారీలో ఉన్నాడు. ఆటో డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్, జమాల్ సాబ్ భార్య పోలీసుల అదుపులో ఉన్నారు.
పచ్చని కుటుంబాల్లో వివాహేతర సంబంధాల చిచ్చు
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్దలు అంటే భయంతోనో భక్తితోనో సంసారాలు సాగేవి. కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు. పైగా చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఇదే సమయంలో భేదాభిప్రాయాలు తలెత్తి కలకాలం కలిసి ఉంటామని భాస చేసుకున్న భార్యా భర్తలు ఇతరుల పంచన చేరుతున్నారు. ఇది అనైతికం అయినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఫలితంగానే హత్యల వంటి ఘటనలు జరుగుతున్నాయి. జమాల్ సాబ్ హత్య ఘటననే తీసుకుంటే.. అతడు అతడు భార్యను ఎంతో అన్యోన్యంగా చూసుకుంటాడు. సొంత రెక్కల మీదనే కుమార్తెలకు ఘనంగా పెళ్లిళ్లు చేశాడు. తాపీ మేస్త్రి గా ఊర్లో మంచి పేరు గడించాడు. కానీ అతని భార్య చేసిన తప్పుకు బలయ్యాడు. ఇప్పుడు అతని కూతుర్లు విలపిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. అదే సమయంలో వారి తల్లిని గ్రామస్తులు దూషిస్తున్న తీరు ఏవగింపు కలిగేలా చేస్తున్నది. అందుకే పెద్దలు వ్యసనం ఏడూళ్ళ ప్రయాణం అన్నారు. ఆ వ్యసనమే ఆ ఆటో డ్రైవర్ తో హత్యకు పురిగొల్పించింది. నాడిపట్టి వైద్యం చేయాల్సిన ఆర్ఎంపి విషపు ఇంజక్షన్ ఇచ్చి ఒక ప్రాణాన్ని తీసేందుకు ప్రేరేపించింది.
Recommended videos: