NTR Health University Name Change: గత మూడేళ్లుగా ఏపీలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చేతిలో అధికారం ఉంది కదా.. అని వెనుకా ముందు చూసుకోకుండా పాలన సాగిస్తున్నారన్న అపవాదు అయితే ప్రభుత్వంపై ఉంది. ప్రజలు అంతులేని విజయం అందించారు.. ఏమైనా చేసుకోవచ్చన్న భావనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. రాజ్యాంగమంటే లెక్కలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అదే రాజ్యాంగబద్ధంగా తాము ఎన్నికయ్యామన్న విషయాన్నే మరిచిపోతున్నారు. న్యాయ వ్యవస్థనే ప్రశ్నిస్తున్నారు. సానుకూల తీర్పులు వస్తే స్వాగతిస్తున్నారు. ప్రతికూల తీర్పులు వస్తే మాత్రం నేరుగా న్యాయమూర్తులపైనే అసభ్య పోస్టులు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ పాలకులకు ఏదీ కనిపించదు..ఏదీ వినిపించదు. అధికార మదంతో ఉన్నవారికి మంచీ చెడులు అసలు కనిపించడం లేదు. ఫలితమే ఈ చిల్లర రాజకీయాలు, చిన్నపిల్లల చాక్లెట్ తగాదాల మాదిరిగా ఏపీ రాజకీయాలనైతే దిగజార్చారు. చిల్లర రాజకీయాలకు ఆజ్యం పోశారు. వచ్చే ప్రభుత్వాలు అమలుచేయకుంటే చేతకానివిగా నిలబడతాయి. అందుకే గ్యారెంటీగా ఈ పరంపరను కొనసాగిస్తాయి. ఫలితంగా ఇబ్బందులు పడేది ప్రజానీకమే.
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాల ట్రెండ్ మారిపోయింది. ఏ సోషల్ మీడియా హైప్ ద్వారా అధికారంలోకి వచ్చారో.. అదే సోషల్ మీడియాను నియంత్రించే పనిలో పడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. బలహీనులైతే దండిస్తున్నారు. ఇతరులను బెదిరిస్తున్నారు. మూడేళ్లలో చిల్లర రాజకీయాలు ఓ బెంచ్ మార్కును దాటిపోయాయి. రేపు టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే…ముందు ప్రభుత్వం చేసిన వాటిని సరిచేస్తున్నామని చెబితే… అంతకు మించి చిల్లర రాజకీయాలు చేస్తే..ఇప్పుడున్న పాలకులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. రాత్రులు కంటిమీద కునుకు ఉండదు. ప్రశాంతత కరువవుతోంది. ఇప్పడు తమకు ఎదురైన ప్రతికూల పరిస్థితులపై.. రేపు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిస్పందించక తప్పదు. లేకపోతే చేతికానివారు అన్న అపవాదునువారు మూటగట్టుకుంటారు. ఇంతకు మించి చేస్తేనే భలే రివేంజ్ తీర్చుకున్నారంటూ ప్రశంసలు లభిస్తాయి. రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తు వేసిన వారంటూ వారికి కితాబులు లభిస్తాయి.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే తీసుకుందాం. అసలు ఆ విద్యాసంస్థ ఏర్పాటు నిర్ణయం, దాని వెనుక కృషి అంతా ఎన్టీఆర్ దే. ఆలోచన, ఆచరణ అన్నీ ఆయనవే. అందుకే రాష్ట్రంలో వచ్చిన తదుపరి ప్రభుత్వాలన్ని ఆయన పేరు మీద యూనివర్సిటీ ఉండడం న్యాయమని భావించాయి. చివరకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అదే గౌరవంతో మెసులుకున్నారు. అసలు పేరు మార్చాలన్న ఆలోచనే చేయలేదు. కానీ జగన్ వారందరికీ అతీతుడును అన్నట్టు ఈ అంశంలో ఎందుకు వేలు పెట్టారో తెలియడం లేదు. అయితే గతంలో వైఎస్ కూడా ఇటువంటి చిన్న తప్పిదం చేశారు.
విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు తీసి.. రాజీవ్ గాంధీ పేరు పెట్టి అపవాదును మూటగట్టుకున్నారు. తరువాత ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పాలకులెవరూ ఇటువంటి దుశ్చర్యలకు ఒడిగట్టలేదు. అంతెందుకు రాజకీయ బద్ధ విరోధిగా ఉన్న చంద్రబాబు వైఎస్ పేరును ఎక్కడా మార్చిన దాఖలాలు లేవు. ఆయన తలచుకుంటే కడప జిల్లా మందు వైఎస్ పేరు ఉండేదా? పోనీ ఇలానే ఆలోచిస్తే.. రేపు అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా వైఎస్ పేరు కనిపిస్తుందా? అన్నది ఆలోచించాలి. ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాల్సిన అవసరముంది.
Recommended videos: