NTR Centenary Celebration : నందమూరి తారక రామారావు.. ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు..తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని విశ్వవ్యాపితం చేసిన మహా నాయకుడు కూడా. నటుడిగా, రాజకీయ నేతగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. ఎన్టీఆర్ ప్రవేశంతో తెలుగు సినిమా చరిత్ర గతి మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల గతిని మార్చింది. సినీ రంగంలో ఆయన చేయని పాత్ర లేదు. పౌరాణిక, జానపదాల స్పెషలిస్ట్ ఆయన, రాముడైనా, కృష్ణుడైనా ఆ పాత్రకు ప్రాణం పోసింది ఆయనే. సమాజహితం కోసం తన ఇమేజ్ ను సైతం పక్కన పెట్టి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు ఆయన. అందుకే శక పురుషుడికి ముందుగా శత జయంతి దినోత్సవ శుభాకాంక్షలు ఆర్పిద్దాం.
ఆ యుగ పురుషుడి శతజయంతి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విజయవాడలో వేడుకలు జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ లోని కైతలాపూర్ గ్రౌండ్ లో శనివారం జరగనున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అతిరథ మహారథులు కార్యక్రమానికి రానున్నారు. ఒకే వేదికపై మెరవనున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వస్తారు. ఎన్టీఆర్ కుటంబసభ్యులతో పాటు ఊహించని సినీ స్టార్లు అందరూ తరలి రాబోతున్నారని చెబతున్నారు. ‘గెస్ట్స్ ఆఫ్ ఆనర్’గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ , సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా , సీపీఎం జాతీయ సెక్రటరీ శ్రీ సీతారామ్ ఏచూరితో పలువురు రాజకీయ నేతలు పాల్గొంటారు.
అగ్రహీరోలకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. వారంతా హాజరుకానున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్, శివరాజ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారంతా హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా ఒకే వేదిక కనిపిస్తే అదో సంచలనం అవుతతుంది. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సావనీర్, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలతోపాట పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పలువురు ప్రముఖులకు కమిటి పురస్కారాలు అందిస్తుంది. ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్’ వెబ్‌సైట్ అవిష్కరిస్తారు.
రాజకీయాలకు అతీతమైన కార్యక్రమమని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక భారీ స్కెచ్ నడిచినట్టు సమాచారం. ఇప్పటికే టీడీపీ, జనసేనల మధ్య పొత్తు అనుకూల వాతావరణం ఏర్పడింది. అందుకే పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిచారు. ఇక ఎప్పటి నుంచో టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం హాజరుకావాల్సిన అనివార్య పరిస్థితి. మరోవైపు బీజేపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి సైతం హాజరవుతుండడంతో పొలిటికల్ గా ఓ సీన్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు కార్యక్రమాన్ని వాడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు మించి శక పరుషుడి శత జయంతి వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి.