
CM Jagan: ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతుండడం అధికార పార్టీని కలవరపరుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని భయం వెంటాడుతోంది. కానీ అదే సమయంలో విపక్షాల మధ్య అనైక్యత ఉండడంతో వైసీపీకి ఉపశమనం కలిగించే విషయం. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి నడవాలన్నదే చంద్రబాబు అభిమతం. కానీ బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. కలిసి వచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు వ్యవహార శైలిని ఇష్టపడడం లేదు. దీంతో చంద్రబాబు కూడా బీజేపీ కలిసి రాదని డిసైడ్ అయిపోయారు. అందుకు రాష్ట్ర నేతలే కారణమని అనుమానిస్తూ.. వారిని టార్గెట్ చేసుకుంటూ బీజేపీ నుంచి టీడీపీలోకి చేరికలను ప్రోత్సహించారు. చాలామంది నాయకులను సైకిలెక్కించే పనిలో పడ్డారు.
అటు పవన్ కూడా పొత్తుల విషయంలో సైలెంట్ అయ్యారు. పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అయితే దీనికి చంద్రబాబు అండ్ కోతో పాటు ఎల్లో మీడియా కారణంగా తెలుస్తోంది. ఒక వైపు స్నేహహస్తం అందిస్తూనే క్రెడిబులిటీని తగ్గించే విధంగా ఎల్లో మీడియా ప్రయత్నిస్తుండడం పవన్ కు మింగుడుపడడం లేదు. బీఆర్ఎస్ అధినేతకేసీఆర్ తనకు రూ.1000 కోట్ల లంచం ఇవ్వబోయారంటూ ఏబీఎన్ రాధాక్రిష్ణ ప్రత్యేక కాలమ్ రాశారు. దీనిపై విమర్శలు వ్యక్తం కావడం, టీడీపీ శ్రేణుల నుంచి ఆర్కేపై దుమారం రేగడంతో ఇప్పుడు సరికొత్త వక్రభాష్యం చెబుతున్నారు. కేసీఆర్ ఇవ్వజూపారే తప్ప.. పవన్ తీసుకోలేదు కదా అని కొత్తగా చెప్పుకొస్తున్నారు. అయితే దీని వెనుక చంద్రబాబు ఉన్నారని మాత్రం పవన్ నమ్ముతున్నారు. అందుకే పొత్తులపై పునరాలోచనలో పడినట్టు వార్తలు వస్తున్నాయి.
అటు జగన్ కు కావాల్సింది కూడా అదే పథకాల రూపంలో పేద, సామాన్యుల ఓటు బ్యాంక్ స్థిరంగా కొనసాగగలుగుతున్నారు. ఈ విషయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫార్ములాను అనుసరిస్తున్నారు. పేదలకు కడుపునిండా తిండి, కూలీ, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులకు నగదు పంపిణీ చేస్తున్నారు. కానీ రాష్ట్రాన్ని అప్పలుపాలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. అయితే పథకాలు దక్కించుకున్న పేదలకు మాత్రం ఈ రాష్ట్రం ఏమైపోతే ఏంటి అన్న ధోరణి ఉంటుంది. జగన్ లో కూడా అదే ధీమా. అందుకే తాను పేదల కోసం క్లాస్ వార్ చేస్తున్నట్టు గొప్పగా ప్రకటించుకున్నారు. పేదలంతా తన వైపు.. మిగతా వర్గాలు ఒక వైపు ఉన్నట్టు భావిస్తున్నారు. మిగతా వర్గాల ఓటు చీలిపోతే పేదల సాలిడ్ ఓట్లతో తాను గద్దెనెక్కుతానని భావిస్తున్నారు.

ప్రస్తుతం వైసీపీ సర్కారుపై విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉంది. దానిని విపక్షాలు మరింత పెంచడంలో సక్సెస్ అయ్యాయి. కానీ దానిని క్యాష్ చేసుకోవడంలో మాత్రం అనైక్యత కనబరుస్తున్నారు. టీడీపీ, జనసేనలు కలిస్తే విజయం దక్కుతుందని ప్రతిఒక్కరూ భావిస్తున్నారు. అదే టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే ఏకపక్షంగా గెలుపు సాధ్యమని నమ్మకంగా చెబుతున్నారు. తన ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని తెలిసినా.. విపక్షాల మధ్య రాజకీయ అనైక్యత, పేదలు తన వెంటే ఉంటారన్న నమ్మకం జగన్ లో ఉంది. అందుకే తీవ్ర ప్రజా వ్యతిరేకత మధ్య అధికారాన్ని పదిలపరుచుకుంటానని జగన్ నమ్మకం చెప్పగలుగుతున్నారు.