
Secunderabad – Tirupati Vande Bharat Express: ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ఫిబ్రవరిలో రెండుసార్లు షెడ్యూల్ ఖారరై చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా మూడోసారి ఏప్రిల్ 8న మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారం అందింది. తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. అధికారిక కార్యక్రమాలతోపాటుగా బహిరంగ సభలో పాల్గొనే విధంగా పార్టీ నేతలు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. ఈ పర్యటనలోనే సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ను ప్రధాని ప్రారంభిస్తారని సమాచారం.
ఎన్నికలపై దృష్టి..
ప్రధాని మోదీ వచ్చే నెల 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నట్లు సమాచారం. పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. అధిష్టానం కూడా ప్రతీనెల ముఖ్య నేతల పర్యటనలు ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా ఏప్రిల్ 8న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పననులతో పాటుగా.. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
మరో వందేభారత్ ప్రారంభం..
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి రోజున ప్రధాని సికింద్రాబాద్ – విశాఖపట్టణం వందేభారత్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అదే రోజున కేంద్ర రైల్వే మంత్రి తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందేభారత్ రైళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. అందులో ఇప్పుడు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. నారాయణాద్రి రూటులో గుంటూరు మీదుగా ఈ రైలును నడపాలని నిర్ణయించారు. రైల్వే బోర్డు నుంచి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందింది. ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ కొత్త సర్వీసును ప్రారంభించనున్నారు. దీని ద్వారా సికింద్రాబాద్ నుంచి ఏడు గంటల్లో తిరుపతి చేరుకొనే అవకాశం కలుగుతుంది.

సికింద్రాబాద్‌లో బహిరంగ సభ..
మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. గతంలోనే మోదీ హైదరాబాద్ పర్యటన వేళ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ.. రాజకీయంగా చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రధాని సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేది బీజేపీ నేతల వ్యూహం. అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఎన్నికలకు సంబంధింది దిశా నిర్దేశం చేయనున్నారు. అధికారిక షెడ్యూల్ వెల్లడి కానప్పటికీ.. ప్రధాని పర్యటన ఖరారైనట్లుగా పార్టీ నేతల సమాచారం.