
Balagam Director Venu Remuneration: బలగం మూవీ ఈ ఏడాదికి మొదటి సెన్సేషనల్ హిట్. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా బడ్జెట్ రూ. 5 నుండి 6 కోట్లని సమాచారం. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 22 కోట్ల గ్రాస్, రూ. 10 కోట్లకు పైగా షేర్ సాధించింది. అంటే డబుల్ ప్రాఫిట్ అన్నమాట. డబ్బులు లెక్కలు పక్కన పెడితే ఓ మంచి సినిమాను ప్రేక్షకులు థియేటర్స్ లో ఆదరించడం గొప్ప విషయం. నాలుగో వారంలో కూడా బలగం వసూళ్లు తగ్గలేదు. ఓటీటీలోకి అందుబాటులోకి రాకుంటే మరిన్ని సంచలనాలు నమోదయ్యేవి.
కాకి ముట్టుడు అనే సంప్రదాయాన్ని తీసుకుని దాని చుట్టూ ఎమోషనల్ కథ రాసుకున్న వేణు ఎల్దండి ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక మనిషి చావు మీద ఇంత మంచి డ్రామా నడిపించవచ్చా అని ప్రేక్షకులు వాపోతున్నారు. తెలంగాణా సంస్కృతి, పల్లె జీవనం, కుటుంబాల మధ్య అనుబంధాలు, మనస్పర్థలు గొప్పగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు పాత్రలే కనిపిస్తాయి. ఒక ఊరిలో, కుటుంబంలో జరుగుతున్న వ్యవహారం పక్కనే ఉండి చూస్తున్న భావన కలుగుతుంది.
వేణుకు ఇంత టాలెంట్ ఉందా అని సినిమా వర్గాలు విస్మయానికి గురవుతున్నాయి. మరి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన వేణుకు నిర్మాత దిల్ రాజు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? బలగం సినిమాతో వేణుకు ఆర్థికంగా ఎంత దక్కింది? అనే సందేహాలు ఉన్నాయి. వీటికి ఆయనే సమాధానం చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణును యాంకర్… బలగం సినిమాకు దిల్ రాజు మీకు ఎంత ఇచ్చారని అడిగారు. అది చెప్పకూడదు. ప్రోటోకాల్ కాదంటూ వేణు దాటవేశారు.

దిల్ రాజు మీకు ఆడి లేదా రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతుందని యాంకర్ అన్నారు. కారు ఇస్తే ఖచ్చితంగా మీకు చూపిస్తాను. వీటన్నింటికి మించి ఆయన నా ప్రేమ చూపించే ప్రేమ విలువైంది. వందల కోట్ల రూపాయలతో సినిమాలు తీసే దిల్ రాజుకు నాతో చిన్న సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ మా సినిమాను నమ్మి కష్టపడి నిర్మించారు. ఆయన ఈ సినిమాతో కోట్లు సంపాదించుకోవాలనే ఆలోచన లేదు. ఆయన నిజాయితీగల సినిమా లవర్. అందుకు ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి అన్నారు. తనకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చాడనేది మాత్రం చెప్పలేదు.