
Eenadu Vs Sakshi: ” పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు” అని వెనుకటికి ఓ మహానుభావుడు అన్నాడు.. ఆయన అన్న ఆ మాటలను ఇప్పుడు తెలుగు నాట ఈనాడు, సాక్షి నిజం చేసి చూపిస్తున్నాయి.. వాటి యాజమాన్యాలకు పొలిటికల్ లెక్కలు ఉండడంతో… విలువలకు పాతర వేస్తున్నాయి..”ది లార్జెస్ట్ సర్క్యు లేటేడ్ తెలుగు డయిలీ”, ” సత్యమేవ జయతే” అనే ట్యాగ్ లైన్స్ తో ఉదయం గుమ్మాలను పలకరించే ఈ పత్రికలు.. తమ స్వప్రయోజనాల కోసం విశ్వసనీయతను వేసుకుంటున్నాయి. ఇటీవల పట్టాభి వ్యవహారంలో ఈనాడు బజారున పడితే.. కొద్దిరోజుల వ్యవధిలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదంతం లో సాక్షి వీధిలో పడ్డది.. అయితే ఈనాడు తప్పుకు చింతిస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. పాఠకుల విషయంలో సాక్షి కనీసం ఆ విజ్ఞత కూడా ప్రదర్శించలేదు. ఇప్పుడు ఇదే విమర్శలకు దారి తీస్తోంది. తప్పును ధైర్యంగా ఒప్పుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో సాక్షి యాజమాన్యం చెప్పాల్సి ఉంది.. తాను రోజు విదిలిస్తున్న సత్యమేవ జయతే అనే పదానికి అర్థం అదేనా అనేది సాక్షి చెప్పాల్సి ఉంది.
కొద్ది రోజుల క్రితం టిడిపి జాతీయ ప్రతినిధి పోలీసులు అరెస్ట్ చేశారు.. కోర్టుకు హాజరై సమయంలో పట్టాభి తనను పోలీసులు కొట్టారంటూ రెండు చేతులను మీడియా ప్రతినిధులకు, టీడీపీ కార్యకర్తలు, నేతలకు చూపారు. దీనిని వార్త లాగా చూస్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఈనాడు ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించింది. ఎప్పుడో పట్టాభిని కొట్టిన దెబ్బలను, ఇప్పుడే జరిగినట్టు ఈనాడు ఫోటోలను ప్రచురించింది.. దీంతో వెంటనే వైఎస్ఆర్సిపి కౌంటర్ ఇచ్చింది.. సాక్షి కూడా ఈనాడు ను తిడుతూ ఒక పేజీ నిండా వార్తలు ప్రచురించింది..ఆ ఫోటోలు పాతవని, కేవలం జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రచురించారని వైఎస్ఆర్సిపి గగ్గోలు పెట్టింది.. ఈ నేపథ్యంలో ఈనాడు తన పాఠకులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

ఇక ఈనాడు తర్వాత తప్పు చేయడం సాక్షి వంతయింది. ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు కొట్టుకున్నారు.. అయితే బాధితులం తామంటే తామని అటు జగన్ పార్టీ సభ్యులు, ఇటు చంద్రబాబు పార్టీ సభ్యులు వాదనకు దిగారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఈనెల 21న సాక్షి పత్రిక అసెంబ్లీకి బ్లాక్ డే అన్న శీర్షికతో ఒక వార్త ప్రచురించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం పై పేపర్లు దాడి చేస్తున్న టిడిపి సభ్యులు అంటూ ఒక ఫోటో ప్రచురించింది. ఇదే ఫోటోను 19వ తేదీన కూడా ప్రచురించడం గమనార్హం. వాస్తవానికి ఆరోజు అసెంబ్లీకి హాజరుకాని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని స్పీకర్ పై దాడి చేసిన ఫోటోలో ఉండటమే రచ్చకు దారి తీసింది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న టిడిపి వైసిపి పై ఎదురు దాడికి దిగింది. భవానికి సంఘీభావంగా ఆమె బాబాయ్ అచ్చం నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి జగన్, భారతి రెడ్డి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు…
ఈనాడు, సాక్షి వ్యవహారాన్ని పరిశీలిస్తే యాజమాన్యాల కున్న పొలిటికల్ లెక్కలు వాటి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఉద్యోగులను కూడా తమ రాజకీయ వ్యవహారాల్లో పావులుగా వాడుకుంటున్న నేపథ్యంలో, వారిపై ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో ఈ యాజమాన్యం కళ్ళల్లో ఆనందం చూసేందుకు ఉద్యోగులు తప్పులు చేయాల్సి వస్తోంది. ఇది అంతిమంగా ఆయా పత్రికలను జనాల్లో చులకన చేస్తోంది. కనీసం ఒకటి రెండు రోజుల ముందు ఫోటోలను కూడా గుర్తించకుండా ప్రచురిస్తున్నాయి అంటే యాజమాన్యాలు ఎంత లోపభూయిష్ఠంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.. ఇక పట్టాభి విషయంలో జరిగిన తప్పునకు సంబంధించి ఈనాడు ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. కానీ సాక్షి కనీసం ఒక క్షమాపణ ప్రకటన కూడా చేయలేదు. మొన్నటిదాకా ఈనాడుకు సుద్ధులు చెప్పిన సాక్షి.. ఇప్పుడు తాను అదే గోతిలో పడటం ఇక్కడ విశేషం.