Rs.500 Cancelled : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సంచలన ప్రకటన చేయబోతోందా.. ఇప్పటికే రూ.2000 నోట్లు ఉపసంహరించుకున్న ఆర్బీఐ త్వరలో రూ.500 నోట్లు కూడా ఉపసంహరించుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. రూ.2000 నోట్లు మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ గడువుగా ప్రకటించింది. తాజాగా పెద్దనోట్ల ఉపసంహరణ అంశంపై కూడా క్లారిటీ ఇచ్చింది.
ఉపసంహరణ ఆలోచన లేదు..
రూ.2000 నోట్ల రద్దు ఉపసంహరణ తరువాత రూ.500 నోట్ల రద్దుపైన చర్చ మొదలైంది. రూ.500 నోట్లను కూడా ఉప సంహరించకుతున్నారంటూ సోషల్ మీడియా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 నోట్లపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్లను సర్క్యూలేషన్ నుంచి ఉపసంహరించుకునే ఉద్దేశ్యం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రూ.500 నోట్లను వెనక్కి తీసుకుని రూ.1000 నోట్లను పున:ప్రవేశపెట్టాలనే ఆలోచనేమీ లేదన్నారు. రూ.2000 ఉపసంహరణ నేపథ్యంలో కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. ఎవరూ ఇటువంటివి పరిగణలోకి తీసుకోవద్దని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆ నోట్లు 50 శాతం రిటర్న్..
మే 19న ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటూ ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 డెడ్‌లైన్‌గా ఖరారు చేసింది. ఈ నోట్ల డిపాజిట్‌పైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక అంశాలను వెల్లడించారు. గడిచిన 20 రోజుల్లో రూ.2000 నోట్ల డిపాజిట్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. కేవలం మూడు వారాల్లోనే 50 శాతం నోట్లు డిపాజిట్ అయినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లలో 85 శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చినట్లు తెలిపారు. మార్చి 31 వరకు చలామణిలో ఉన్న రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. చివరి వరకు నోట్ల మార్పు కోసం వేచి చూడవద్దని ఆర్బఐ గవర్నర్ సూచించారు. రద్దీని తగ్గించేందుకు ప్రజలు ముందుగానే రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా సెంట్రల్ బ్యాంకు కరెన్సీ కలిగి ఉందని స్పష్టం చేశారు.
కొత్తగా రూ.1000 నోటు ఆలోచన లేదు..
రూ.2000 నోట్ల ఉపసంహరణతర్వాత రూ.1000 నోట్లు ప్రవేశపెడతామని ప్రచారం జరుగుతోందని శక్తికాంత్‌దాస్ తెలిపారు. ఇది కూడా పూర్తిగా అవాస్తవమన్నారు. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం వంటి ఆలోచన ఆర్బీకి లేదని స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో సామాన్యుల్లో నెలకొన్న అపోహాలు.. సందేహాలకు ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది.