Rohit Sharma: ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా టీమిండియా పరిస్థితి మారింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ చేసిన త్యాగం ఫలించలేదు. ఫలితంగా ముక్కోణపు సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను బంగ్లాకు అర్పించింది. స్వయంకృతాపరాధమే భారత్ ను కష్టాల్లో పడేసింది. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాను కట్టడి చేయలేకపోయారు. అనవసరంగా పరుగులిచ్చి బంగ్లా చేతిలో చావుదెబ్బ తిన్నారు. బంగ్లాదేశ్ కదా ఏముందిలే అనుకుంటే వారే మనకు షాకిచ్చారు. మనవారి ఆటతీరు అంత అధ్వానంగా ఉందని అర్థమవుతోంది. గెలిచే మ్యాచులను మన తప్పిదాలతో వారికి అప్పగించడం మన వారికి షరామామూలుగా మారింది.

ఇక్కడ చెప్పుకోవాల్సింది కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. వేలికి గాయమైనా లెక్కచేయకుండా బ్యాటింగ్ కు దిగి అందరి హృదయాలను కొల్లగొట్టాడు. నా కోసం కాదు దేశం కోసం ఆడుతున్నాననే మనోనిబ్బరంతో గాయాన్ని సైతం పట్టించుకోకుండా అతడు మైదానంలోకి దిగడం భారతీయులకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. దేశం కోసం రక్తమోడుతున్నా ఫర్వాలేదని అతడు చూపిన వీరోచితం అందరి కళ్లలో ఆనంద భాష్పాలను రాల్చింది. దేశభక్తి అంటే ఇదే అనే రేంజ్ లో రోహిత్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
భారత్ కు 59 పరుగులు అవసరమైన సమయంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు రోహిత్ శర్మ. రావడంతోనే రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టడంతో 46వ ఓవర్లో 18 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓవర్ లో సిరాజ్ నాలుగు బంతులు ఎదుర్కొని సింగిల్ మాత్రమే తీశాడు. రోహిత్ రెండు బంతుల్లో పరుగులు తీయలేపోయాడు. 49వ ఓవర్లో రోహిత్ రెండు సిక్సులు బాదడంతో ఇరవై పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి ఇరవై పరుగులు కావాలి. రోహిత్ రెండు ఫోర్లు కొట్టినా ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా ముస్తాఫిజర్ డాట్ బాల్ వేయడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో భారత్ ఓడినా రోహిత్ శర్మ మాత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. వేలికి గాయమైనా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును విజయతీరాలకు చేర్చాలని చేసిన కృషి అందరిలో ఎంతో కనువిప్పు కలిగించింది. దేశ బాధ్యతలను భుజానికెత్తుకున్న కెప్టెన్ తీరుగా రోహిత్ శర్మపై ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిసింది. ఆపద సమయాల్లో జట్టుకు అండగా ఉండేవాడే కెప్టెన్ అంటూ పలువురు కితాబిచ్చారు. దీంతో రోహిత్ శర్మకు మంచి మార్కులు పడ్డాయి. సిరీస్ చేజారినా అతడిలోని ధైర్యానికి అందరు అవాక్కయ్యారు.

రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేసే సమయంలో అనుముల్ హక్ ఇచ్చిన క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడ్డాడు. రెండో ఓవర్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీంతో రోహిత్ మైదానాన్ని వీడి ఫిజియో సూచనల మేరకు హాస్పిటల్ కు వెళ్లి స్కానింగ్ చేయించుకుని వచ్చినా బొటనవేలికి కట్టు కట్టారు. వేలు ఫ్రాక్చర్ కాకపోయినా గాయం మాత్రం పెద్దగానే అయింది. కానీ దాన్ని లెక్కచేయకుండా రోహిత్ఆట కొనసాగించడంతో అందరు పొగడ్తలతో ముంచెత్తారు.