Rocket Raghava – Sudigali Sudheer: ఒకప్పుడు జబర్దస్త్ అంటే మంచి రేటింగ్స్ ఉండేవి.. టాప్ కమెడియన్లు డిఫరెంట్ స్కిట్లతో జనాలను అలరించేవారు.. మల్లెమాల కూడా భారీగా లాభాలు గడించేది. అదంతా గతం. ఇప్పుడు ఒక్కొక్కరు జబర్దస్త్ విడిచి వెళ్ళిపోతున్నారు. నానాటికి నాసిరకం స్కిట్లు ప్రేక్షకులకు తలనొప్పి కలిగిస్తున్నాయి.. ఆ డబుల్ మీనింగ్ డైలాగులు, కురచ దుస్తులు సరే సరి. టీవీ రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి. అయినప్పటికీ ఆ మల్లెమాలవాళ్ళకు సోయి రావడం లేదు.. అక్కడ మిగిలిపోయిన వాళ్లకూ లేదు. అసలే అంతంత మాత్రమే ప్రజాదరణ ఉన్నప్పుడు కాస్త మనసుపెట్టి స్కిట్స్ చేయాలి.. థర్డ్ రేట్ కామెడీతో విసిగిస్తూ, మరోవైపు వెళ్లిపోయిన వాళ్ళ మీద వెకిలి వ్యాఖ్యలు దేనికో ఆ శ్యాం ప్రసాద్ రెడ్డి కే తెలియాలి.

9వ తేదీన ప్రసారం కాబోయే జబర్దస్త్ ప్రోమో ఒకటి విడుదలైంది.. ఎప్పటిలాగే కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జిలు.. సౌమ్య యాంకర్. ఓ స్కిట్ లో ఓ కమెడియన్ వచ్చి రాకెట్ రాఘవను ” మంచితనం ఇన్నాళ్ళూ కామెంట్లోనే చూశాను. ఇప్పుడు నిజంగా కళ్ళారా చూస్తున్నాను.. కామెంట్లు నువ్వు రాయించుకునే వాడివా” అని అడుగుతాడు.. నిజానికి ఈ వ్యాఖ్య స్కిట్లో అసలు సెట్ కాలేదు.. దానికి రాఘవ ” అలా రాయించుకున్నోళ్ళు వాయించుకుని ఎప్పుడో బయటికి వెళ్లిపోయారు” అని అంటాడు. దీంతో జడ్జిలు పగలబడి నవ్వారు.. దీనికి అర్థం ఏమిటో తెలియని సౌమ్య కూడా నవ్వింది.
రాఘవ ఎప్పుడూ కాస్త సెన్సిబుల్ గా మాట్లాడుతాడు అని ఇన్నాళ్లు అనుకునేవాళ్ళం.. ఎవరిని కామెంట్ చేయకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా తన పని ఏదో తాను చేసుకుంటాడని అనుకున్నాం. కానీ వెళ్లిపోయిన ఒక తోటి ఆర్టిస్టు మీద పిచ్చి వ్యాఖ్యానం చేశాడు. నిజానికి కామెంట్లలో తోపు, సూపర్, బంపర్ అని తరచూ సుడిగాలి సుధీర్ పేరిట కనిపిస్తుంటాయి.. దాని మీద కూడా రకరకాల జోకులు పలు స్కిట్లలో వేశారు.. వాటిని సుధీర్ ఎప్పటిలాగే తన సహజ తత్వంతో లైట్ తీసుకొని, తనూ నవ్వేసి వదిలేశాడు.
అతను వెళ్ళిపోయాడు.. అతడి సినిమా ఒకటి హిట్ అయింది. ఈరోజు జబర్దస్త్ కమెడియన్ కాదు తను. టాలీవుడ్ లో ఒక చిన్నపాటి హీరో. అలాగే ఆహా లో కామెడీ ఎక్స్చేంజ్ వంటి షో చేస్తున్నాడు.. వెక్కిరించినప్పటికీ, వ్యంగాన్ని తనపై రుద్దినప్పటికీ నవ్వుతూ తీసుకుంటాడు తప్ప రియాక్ట్ కాడు. తను వెళ్ళిపోయి ఇన్నాళ్లయినా ఆర్టిస్టులకు ఈ అల్ప గుణం ఎందుకో అర్థం కాదు.

రాయించుకున్నోళ్లు వాయించుకుని వెళ్లిపోయారు అనే రాఘవ కామెంట్ ఒక చెత్త యాటిట్యూడ్ . ఎప్పుడో వెళ్లిపోయిన సుడిగాలి సుధీర్ మీద ఇప్పుడు ఈ వ్యగ్యాలు దేనికి? పోనీ అక్కడ ఉన్నది రష్మీ కాదు సౌమ్య అనే కొత్త యాంకర్. ఈమె కూడా ఏదో భాష తెలియక పోయినప్పటికీ కష్టపడి ఇప్పుడిప్పుడే పికప్ అవుతుందని అనుకుంటే ఈమె కూడా రాఘవలా మారిపోయింది. ఆ మధ్య యాదమ రాజు పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడు సౌమ్య రాజును పెళ్లి గురించి అడిగింది. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని రాజు చెప్పాడు.. దానికి సౌమ్య మిమ్మల్ని ఏం చేసి లవ్ చేసింది అని తిక్క ప్రశ్న అడిగింది. అది ఒక రకంగా ఆ జంటను కించపరచడమే.. ఏమిటో జబర్దస్త్ ఆర్టిస్టులే కాదు… యాంకర్లు కూడా నెత్తి మాసిన వాళ్లలాగా మారిపోయారు.