RK Kotha Paluku: ఒకప్పుడేమో గాని.. ఇప్పటి పరిస్థితుల్లో పాత్రికేయం అలా నిలబడే సామర్థ్యాన్ని కోల్పోయింది. న్యూట్రల్ స్థానంలో డప్పును.. నిష్పక్షపాతంగా ఉండాల్సిన సందర్భంలో వ్యక్తిగత ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టింది. ఇది ఎక్కడదాకా వెళ్తుందో గాని.. ఇప్పటికైతే పరిస్థితి బాగాలేదు.. బాగుంటుందని నమ్మకం కూడా లేదు. అయితే ఈ వ్యవహారంలో అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.. కాకపోతే గిట్టని వాళ్లపై బురద చల్లడం.. నచ్చని వాళ్లపై నాలుగు రాళ్లు ఎక్కువ వేయడం వంటి సిద్ధాంతాలను తెలుగు మీడియా ఒంట పట్టించుకోవడం అసలైన విషాదం. అయితే ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారాలలో పేరుపొందిన పాత్రికేయులు కూడా ఉండడం అసలైన దారుణం..
Also Read: మృగశిర కార్తెకు, చేపలకు సంబంధం ఏంటి? జల పుష్పాలను ఎందుకు ఆరగించాలి? శాకాహారులు ఏం తినాలి?
తాజాగా ఆంధ్రజ్యోతిలో ఆ పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే కొత్త పలుకు శీర్షికన ఆంధ్రప్రదేశ్ లో వర్తమాన రాజకీయాల పై ఒక విశ్లేషణ చేశారు. ఒక పాత్రికేయుడిగా లోతైన వివరాలను వెల్లడించారు. ఈ కాలం నాటి పాఠకులకు అవి అవసరమే. పైగా చరిత్రను చాలామంది మరిచిపోతున్న రోజులివి. గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగిన వారు ఒకప్పుడు చేసిన చీకటి వ్యవహారాలు.. చీకటి బాగోతాలను రాధాకృష్ణ ఆ కథనంలో వెల్లడించారు.. అయితే ఇంతటి సుదీర్ఘ విశ్లేషణలో ఆయన అన్ని కోణాలను కూడా స్పృశించి ఉంటే బాగుండేది. కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మీద మాత్రమే ఆయన వ్యతిరేక కోణాన్ని ప్రదర్శించడం ఒకరకంగా ఆయనలో ఉన్న పసుపు జర్నలిస్టును బయటపెడుతోంది.. నిజానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సుద్ధపూస అని మేం చెప్పడం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సర్వ పరిత్యాగి అని కూడా అనడం లేదు. అధికారం కోసం వారు చేసిన అడ్డగోలు పనులను సమర్థించడం లేదు. కాకపోతే వారిద్దరి మాత్రమే ఇలాంటి పనులు చేయలేదు కదా.
ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న వారంతా కూడా ఇలాంటి వ్యవహారాలలో తలమునకలైన వారే కదా. గౌరు వెంకట్ రెడ్డి నుంచి మొదలుపెడితే మాధవ్ వరకు.. డాక్టర్ సుధాకర్ కు జరిగిన అవమానం నుంచి మొదలు పెడితే వరప్రసాద్ కు చేసిన శిరముండనం వరకు అన్ని విషయాలను ప్రస్ఫుటంగా చెప్పిన రాధాకృష్ణ.. మరి టీడీపీ విషయంలో.. టిడిపి నాయకుల విషయంలో ఎందుకు సైలెంట్ అయినట్టు. అంటే వారు చేసిన రాజకీయాలు మొత్తం నిష్పక్షపాతమైనవేనా.. హత్య రాజకీయాలు.. నేరమయ రాజకీయాలు వారు చేయలేదా. తెనాలిలో జగన్మోహన్ రెడ్డి నేరస్థులను పరామర్శించాలని అంకమ్మ శివాలు ఊగిన రాధాకృష్ణ.. పసుపు నేతల వ్యవహార శైలి గురించి ఎందుకు సైలెంట్ అయిపోయారు.. ఎందుకు రాయలేకపోయారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నయీమ్ అనే కరుడుగట్టిన నేరస్థుడిని పోషించింది ఎవరు? అతడి వికృతాలకు వంత పాడింది ఎవరు? అతడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసింది ఎవరు? ఎన్నో కేసులు, ఎన్నో వివాదాలు ఉన్న వీరయ్య చౌదరి చనిపోతే చంద్రబాబు పాడే ఎందుకు మోసారు? ఆయన అంతిమక్రియలు పూర్తయ్యేంతవరకు అక్కడ ఎందుకు ఉన్నారు? విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో టిడిపి అధికారులకు వచ్చినప్పుడు చింతమనేని ప్రభాకర్ అనే ఎమ్మెల్యే మహిళా ఎమ్మార్వో పై ఏ విధంగా ప్రవర్తించారు? ఆయనపై నాడు చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మళ్లీ ఆయనకు టికెట్ ఎందుకు కేటాయించారు? ఇటీవల మహానాడులో ఆయన గురించి రాధాకృష్ణ పత్రిక, ఛానల్ లో పదేపదే ఎందుకు చూపించారు, గొప్పగా ఎందుకు ప్రస్తావించారు? ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు.. రాయాలంటే కూడా బోలెడు.
ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లో.. చంద్రబాబు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఎంతమంది పై కేసులు ఉన్నాయి? అందులో తీవ్ర నేరమయమైన కేసులు ఎన్ని ఉన్నాయి? అలా ఉన్నప్పటికీ చంద్రబాబు వారికి టికెట్లు ఎందుకు కేటాయించారు? కొంతమందిని మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకున్నారు? స్థూలంగా చెప్పాలంటే ఒకప్పుడు నేరస్తుల భుజాల మీద చేతులు వేయాలంటేనే నాయకులు ఇబ్బంది పడేవారు.. రాధాకృష్ణ రాసిన విశ్లేషణలు ఇది నూటికి నూరు శాతం నిజం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రౌడీయిజం రాజకీయం వేరువేరు కాదు. అవి రెండు సయామీ కవలలు. జగన్ నేరమయ రాజకీయాల గురించి రాధాకృష్ణ ప్రస్తావించారు కాబట్టి.. చంద్రబాబు తెరవెనుక చేసిన రాజకీయాల పై ఎదురయ్యే ప్రశ్నలకు కూడా రాధాకృష్ణ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ తేనె తుట్టెను కదిపింది రాధాకృష్ణ కాబట్టి!