Mrigashira Karthi 2025: మాడు పగలగొట్టిన ఎండల స్థానంలో వర్షాలు కురుస్తుంటాయి. సూర్యుడు మండే కాలంలో మేఘాలు ఆవరిస్తాయి. ఒకరకంగా వాతావరణం సానుకూలంగా మారుతుంది. సాగుకు అనుకూలంగా మారుతుంది. మృగశిర కార్తెలో వర్షాలు కురవడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నం అవుతారు. విత్తనాలు వేయడం, వరి నార్లు పోసుకోవడం వంటి పనుల్లో ఊపిరి సలపకుండా ఉంటారు. మృగశిర కార్తె ఆగమనం రోజు చాలామంది రైతులు ప్రత్యేక పూజలు చేస్తారు. తమ కులదైవాలకు పూజలు చేసి.. పంటలు మెండుగా పండాలని.. ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని కులదైవాలకు పూజలు చేabసి.. చేపలతో వంటలు ఉండి నైవేద్యంగా పెడుతుంటారని చరిత్ర చెబుతోంది. మృగశిర కార్తె ఆగమనం రోజు చేపలు తింటే అదృష్టం కలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. చేపలు ఆరగించని వారు బెల్లంలో కాస్త ఇంగువ కలిపి.. చిన్న చిన్న ఉండలు లాగా చేసుకుని తింటారు.
ఇక తెలుగు రాష్ట్రాలలో మృగశిర కార్తెకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.. ఈ కార్తె ఆగమనం రోజు మాంసాహార ప్రియులు చేపలను ఆహారంగా తీసుకుంటారు.. మృగశిర కార్తె రోజు వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే వాతావరణంలో మాత్రమే కాకుండా మనుషుల శరీరంలో కూడా మార్పులు జరుగుతాయి. కొంతమంది ఆ మార్పుల వల్ల అనారోగ్యం బారిన పడతారు. అలాంటి సందర్భంలో రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వాటి నుంచి తట్టుకోవచ్చు. అయితే చేపలను తింటే రోగ నిరోధక శక్తి వస్తుందని పెద్దలు నమ్ముతుంటారు. అందువల్లే నాటి నుంచి మృగశిర కార్తె ఆగమనం రోజు చేపలు తినాలనే సంస్కృతి ఆనవాయితీగా వస్తోంది. వర్షాకాల ఆగమనం కాబట్టి మృగశిర కార్తె రోజున చేపలను తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. రోగనిరోధక శక్తిని అందించడానికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. వర్షాకాలంలో సోకే జ్వరం, జలుబు, శ్వాస కోశ వ్యాధుల నుంచి చేపలు రక్షిస్తాయి. చేపల్లో ఒమేగా – 3ఫ్యాటీ యాసిడ్, ప్రోటీన్లు రోగానికి శక్తిని పెంపొందిస్తాయి. అందువల్లే రోహిణి కార్తె ముగిసిన తర్వాత.. మృగశిర కార్తె ప్రారంభమైన రోజు చేపలను తినడం ఆనవాయితీగా వస్తోంది.
శాకాహారులు ఏం తినాలంటే
మృగశిర కార్తె రోజు చేపలు తినని వారు.. ఇంగువను బెల్లం లో పెట్టుకొని తింటుంటారు. కొందరు ఇందులో వాము, జిలకర కూడా కలుపుకొని తింటారు. ఇక ఈ కాలంలో చింతచిగురు విరివిగా లభిస్తూ ఉంటుంది. ఆ చింతచిగురును పప్పులో వేసి వండి.. ఇంగువ పోపుతో పెట్టి తింటే చేపలు తిన్నంత ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.
ముఖ్య గమనిక: పై వివరాలు కొందరు నిపుణులు, వివిధ పుస్తకాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. వీటిలో అన్ని అంశాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు అని.. అవన్నీ కూడా నమ్మిక ఆధారంగానే కొనసాగుతున్నాయి అనేది పాఠకులు గమనించగలరు. ఇక ఈ కార్తె రోజు చేపలు తినాలా? వద్దా? అనేది పాఠకుల వ్యక్తిగత విషయం. ఈ విషయంలో ఒకే తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అనే విషయాన్ని పాఠకులు గుర్తుంచుకోవాలి.