Kantara Oscar: కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదు అని తెలుగు సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇన్నాళ్లు కేవలం బాలీవుడ్ సినిమాలే ఇండియన్ సినిమాలు అని భ్రమపడ్డ వారికి షాకిచ్చేలా తాజాగా సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. బాహుబలితో మొదలైన సౌత్ సినిమాల సందడి తర్వాత కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కార్తికేయ2, విక్రమ్, కాంతారాతో పతాకస్థాయికి చేరింది. ఇప్పుడు దేశంలో పాన్ ఇండియా చిత్రాలంటే మన సౌత్ సినిమాలే.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతోపాటు న్యూయర్క్ క్రిటిక్ అవార్డు పొందింది. ‘నాటునాటు’ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చేలానే పరిస్థితులున్నాయి.
ఈ క్రమంలోనే చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను దున్నేసిన కన్నడ చిత్రం ‘కాంతార’ ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఏకంగా ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ మేరకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ ఏడాది ప్రకటించే 95వ ఆస్కార్ అవార్డులకు ‘కాంతార’ను కూడా నామినేషన్ లో చేర్చాలని హొంబలే ఫిల్మ్స్ అప్లికేషన్ పంపింది. ఇప్పుడు 2 విభాగాల్లో క్వాలిఫై అయినట్లు ఆ సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపింది. ఇప్పుడు ప్రపంచ సినీ దిగ్గజ అవార్డులు ఆస్కార్ కు నామినేట్ అయ్యి భారత ప్రతిష్టను మరింతగా ఇనుమడింపచేసింది.