Senior NTR And Anjaiah- Ramoji Rao: “ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ఇన్ తెలుగు’ అనే ట్యాగ్ లైన్ తో ప్రతిరోజు ఉదయం మన గడపలను తొక్కిన ఈనాడు.. అనివార్యంగా మన ఆలోచనలను కూడా ప్రభావితం చేసింది. ఇది చెప్పేందుకు ఏమాత్రం అతిశయోక్తి లేదు. పాత ఆంధ్రజ్యోతి మూసివేతకు తెరపైకి తీసుకువచ్చిన సారా నిషేధ ఉద్యమం, ఉదయాన్ని మూసివేసేందుకు దాసరి నారాయణరావు పై ప్రకటించిన నిషేధం, వార్త పేపర్ ను ఇబ్బంది పెట్టేందుకు గిరీష్ సంఘీ పై రాసిన వార్తలు… ఒకటా రెండా రామోజీరావు వేసిన వేషాలకు లెక్కేలేదు. ఆయన రాతల వల్ల బాధితులైన వారి ఆవేదనకు అంతూ పొంతూ లేదు. అక్కడ దాకా ఎందుకు చంద్రబాబును లీడర్ గా ప్రొజెక్ట్ చేసేందుకు ఈనాడు ఎన్ని రకాల కుయుక్తులు పన్నాలో అన్ని రకాల కుయుక్తులూ పన్నింది. చివరకు ఎన్టీఆర్ ను గద్దె దించేదాకా వదిలిపెట్టలేదు . ఆ సమయంలో ఎన్టీఆర్ మనసు ఎంత క్షోభ పడిందో ఆయన సన్నిహితులకు తెలుసు.

ఇప్పుడు కూడా ఆయన బొమ్మే కావాలి
ఎన్టీఆర్ గతించి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇవాల్టికి ఆయన పేద ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఆయన గతించిన తర్వాత టిడిపి చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయింది.. తర్వాత అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినప్పటికీ… దానిని సుస్థిరం చేసుకోలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ మరుసటి పర్యాయం అధికారాన్ని కోల్పోయారు.. ఇప్పుడు అక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ సమయంలో పచ్చ మీడియా మనుగడ సాగించాలి అంటే చంద్రబాబు తోడ్పాటు అవసరం. ఆ తోడ్పాటు ఆయన అధికారంలోకి వస్తేనే లభిస్తుంది. కాబట్టి చంద్రబాబును మళ్లీ జాకీలు పెట్టి లేపేందుకు రామోజీరావు తెగ ప్రయత్నిస్తున్నారు.. ఒకప్పుడు తన విషపు రాతల ద్వారా ఎన్టీఆర్ ను తులనాడిన ఆయన పత్రికలో.. ఇవాళ మళ్లీ కీర్తిస్తూ కథనాలు రాస్తున్నారు.. కానీ ఇందులో ఈనాడు విస్మరించిన విషయాలు ఎన్నో ఉన్నాయి.

దాచేస్తే దాగేవా?
1983 వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రస్థానం “రాజకీయ సంచలనం” వరకు బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో ప్రబలిన అరాచకానికి నియంత పాలనకు చరమగీతం అనడం పూర్తిగా అసత్యం. ఆనాడు రాష్ట్రంలో ఎటువంటి అరాచకం లేదు. చట్టబద్ధంగా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తూ వచ్చింది. రాష్ట్రంలో ఆరోజు ఆ పార్టీకి ఉన్న అత్యధిక మద్దతు ఒకరకంగా ఆ పార్టీకి నష్టదాయకమైంది. నిరంకుశ పాలన కన్నా ఆనాటి ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ అవగాహన రాహిత్యం ఒక రకంగా తెలుగుదేశం ఎదుగుదలకు దోహదం చేసింది.

రాజీవ్ గాంధీ నాటి ముఖ్యమంత్రి అంజయ్య తో వ్యవహరించిన తీరు తెలుగువారి ఆత్మగౌరవ అంశాన్ని తెరపైకి తేవడానికి ఎన్టీ రామారావు కు బాగా సహాయం చేసింది. ప్రధానంగా తెలుగుదేశం అధికారాన్ని చేజిక్కించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజ్యాధికారం పొందాలి అని ప్రయత్నం చేసిన ఒక వర్గం ప్రయత్నాలకు విజయం. ఈ ప్రయత్నాల్లో ఎన్టీ రామారావుకు రెండు అంశాలు కలిసి వచ్చాయి. ఒకటి ఆయన సినిమా మాధ్యమం. రెండు మీడియా మాధ్యమం. ఎన్టీఆర్ విజయానికి ఆయన సినిమా గ్లామర్ ఎంత దోహదపడిందో అంతకుమించి రామోజీరావు ఈనాడు మీడియాపరంగా సహకారం దోహద పడింది. బహిరంగంగా కాకుండా వెనుక నుంచి వ్యూహాత్మకంగా మీడియా పరంగా ఈ విజయంలో రామోజీరావు పోషించిన పాత్ర బహిరంగంగా ఎన్టీ రామారావు గారు పోషించిన పాత్ర కన్నా ఎక్కువే. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా 1983 తెలుగుదేశం విజయాన్ని గురించి మాట్లాడలేం.

అంజయ్య ను బద్నాం చేయడంలో..
ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య ను బద్నాం చేయటంలో కూడా ఈనాడు పాత్ర ఎనలేనిది. సాధారణ నేపథ్యంతో అత్యున్నత స్థానం అలంకరించి సమర్థవంతంగా పాలన నిర్వహిస్తున్న అంజయ్య ఆనాడు ఈనాడు వల్ల నష్టపోయినారు. ఈ రకంగా కాంగ్రెస్ ను దెబ్బతీస్తూ తెలుగుదేశం ఎదగడానికి ఈనాడు చక్కని అవకాశం కల్పించింది. ఈనాడు మద్దతు లేకపోతే ఎన్టీ రామారావు గారు నాయకత్వంలో తెలుగుదేశం ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి ఉండేదే.. కానీ అధికారాన్ని చేచిక్కించుకునే స్థాయికి ఎదిగి ఉండేది కాదు. మొదటి విడతలో అధికారం చేజిక్కించుకోకపోతే ఆనాడు తెలుగుదేశం పరిస్థితి ప్రజారాజ్యం లాగా ఉండేదా? అప్పటికి ఇంకా ఎన్టీ రామారావు కు సినిమాలలో గ్లామర్ తగ్గలేదు. రాజ్యాధికారం చేతికి చిక్కకపోతే ఆ ప్రత్యామ్నాయం ఎటు ఉండనే ఉండింది.

ఇప్పటిలాగే అప్పుడు
ఇక అప్పట్లో రాష్ట్ర భవిష్యత్తును గురించి ఆలోచిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజాకర్షణ పథకాలను వ్యతిరేకించే ఎవరైనా ఆనాటి ఎన్టీ రామారావు గారి విధానాలు కూడా తప్పుపట్టవలసి ఉంటుంది.

కాంగ్రెస్ పాలన ఇతర విషయాల్లో ఎట్లా ఉన్నా ఆర్థిక విధానాలు సరిగా ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కగా ఉండింది. ఎన్టీ రామారావు ప్రజాకర్షణ పథకాల వల్ల ఆయన పాలన ముగిసే సమయానికి రాష్ట్రం ఆర్థికంగా దివాలా అంచున ఉండింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలో లాగా. కృత్రిమమైన ఆంధ్రుల ఆత్మగౌరవనే నినాదం ముందుకు తెచ్చి వివిధ ప్రాంతాల ప్రయోజనాలను విస్మరించటం ద్వారా తిరిగి ప్రత్యేక తెలంగాణ వాదానికి బీజం ఎన్టీ రామారావు పాలన సమయంలోనే ఏర్పడింది. ప్రజాకర్ష పథకాల వల్ల చాలామందికి మేలు జరిగిన దీర్ఘకాలిక రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు మాత్రం నష్టం జరిగింది. కానీ ఈ విషయం ఈనాడు చెప్పదు.. ఒకవేళ చెప్పినా అది బాబు కు ప్రయోజనం కలిగించే స్థాయిలోనే ఉంటుంది.

