Ali Fazal-Richa Chadha Wedding Invitation: వెనుకటి రోజుల్లో వివాహ ఆహ్వాన పత్రిక సాదాసీదాగా ఉండేది. రోజులు మారుతున్నా కొద్దీ వివాహ ఆహ్వాన పత్రిక తీరు మార్చుకుంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వివాహ ఆహ్వాన పత్రిక మరింత ఆకర్షణీయంగా తయారైంది. మొన్నామధ్య ముఖేష్ అంబానీ తన తన కుమార్తెకు సంబంధించిన ఒక్కో వివాహ ఆహ్వాన పత్రికకు ₹లక్ష దాక ఖర్చు చేశాడు. అతనంటే ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి పెద్దగా లెక్కచేయడు. కానీ ఒక స్థాయి ఉన్న కుటుంబాలు కూడా వివాహ ఆహ్వాన పత్రికల్లో తగ్గేదేలా అంటూ తమ రీతిని చూపిస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ కపుల్ రీచా చద్దా, అలీ ఫజల్ తమ వివాహ ఆహ్వాన పత్రిక ద్వారా వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ వారు ఏం చేశారంటే.

రీచా చద్దా, అలీ ఫజల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 9 ఏళ్లకు పైగా డేటింగ్ చేసిన ఈ జంట.. అక్టోబర్ 4న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా ఈ ప్రేమ పక్షుల వివాహ ఆహ్వాన పత్రిక కు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అగ్గిపెట్టె ఆకారంలో ఉన్న ఈ పెళ్లి పత్రిక పై బ్రాండ్ పేరు ఉండే చోట కపుల్ మ్యాచెస్ అని రాసి ఉంది. అలీ ఫజల్, రీచా చద్దా లు సైకిల్ తొక్కుతున్న ఫోటోలు ముద్రించారు. ఒకప్పుడు అగ్గిపెట్టెలకు అచ్చు గుద్దినట్లు ఉన్న ఈ వివాహ ఆహ్వాన పత్రిక అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇక వీరి వివాహం ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో జరగనుంది. పెళ్లి అనంతరం ఢిల్లీతో పాటు ముంబైలో విందులు ఏర్పాటు చేశారు. ముంబైలో జరిగే వివాహ విందుకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరుకానున్నారు.

టెంపర్ 30 నుంచి ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్లు ప్రారంభం కానున్నాయి. కాక్ టెయిల్ పార్టీ, సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 2015 నుంచి అలీ, రీచా డేటింగ్ లో ఉన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం కలుసుకున్న వీరిద్దరూ.. తర్వాత ప్రేమ పక్షుల్లాగా మారిపోయారు. 2017లో తమ బంధం గురించి ప్రపంచానికి చెప్పారు. వాస్తవానికి 2020 లోనే ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. కోవిడ్, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఆగేది లేదు అనుకున్నారేమో ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటవుతామని ఇద్దరూ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లిని కూడా కని విని ఎరుగని స్థాయిలో చేసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే తమ ప్రత్యేకతను వివాహ ఆహ్వాన పత్రిక ద్వారా చాటిచెప్పారు. ఇక పెళ్లిలో ఎంత హంగామా చేస్తారో? అసలే డబ్బున్న వాళ్ళు ఎలాగైనా చేయగలరు.