Revanth Reddy : ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులను ప్రారంభించారు. మహిళలు రైస్ మిల్లులు నిర్మించుకునే విధంగా ప్రోత్సాహం కల్పిస్తామని.. భవిష్యత్తు కాలంలో రైతుల పండించిన ధాన్యాన్ని వారే మర ఆడించే విధంగా చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలంలో సర్కార్ ధాన్యాన్ని పందికొక్కులు లాగా బొక్కిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలకు గోదాములు నిర్వహించే బాధ్యత కూడా అప్పగిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గోదాములు నిర్మించి.. వాటిని మహిళలకు అప్పగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో కొంత భాగం భారత రాష్ట్ర సమితి నేతలను విమర్శించడానికి తీసుకున్నారు..
ఆ వ్యాఖ్యలను వీడియోగా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇష్టానుసారంగా ప్రవర్తించారని.. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారని.. రేవంత్ రెడ్డి ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాలేశ్వరం కూలిపోయిందని.. రోడ్లు మొత్తం నాశనం అయ్యాయని.. పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల పరిపాలన పూర్తయిన తర్వాత.. నాటి దారుణాలు మొత్తం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే.. అవన్నీ కూడా తనకు ఆపాదిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతగల ప్రతిపక్షం ప్రభుత్వానికి సహకరించాలని.. పైశాచిక ఆనందం పొందడానికి తనపై ఆరోపణలు చేయడం సరికాదని రేవంత్ రెడ్డి వెల్లడించారు.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా విభాగం తెగ సర్కులేట్ చేస్తోంది. అంతేకాదు తాము చేస్తున్న ఆరోపణలకు రేవంత్ రెడ్డి భయపడ్డారని.. అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటున్నది. అయితే దీనిపై కాంగ్రెస్ నాయకులు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. అధికారాన్ని కోల్పోయి ఏడాది కాకముందే భారత రాష్ట్ర సమితి.. దొడ్డిదారిలో తెలంగాణ ప్రభుత్వ పగ్గాలు అందుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అందువల్లే ఇలాంటి చవక బారు వీడియోలను సర్కులేట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలోనే బలంగా ఉందని.. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దృఢంగా ఉందని నాయకులు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.