Coronavirus Test Mobile App: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విపత్తు సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. లక్షలాది మంది ప్రాణాలనే హరించింది ఈ పెను విపత్తు. ఇప్పుడిప్పుడే మహమ్మారి బారి నుంచి ప్రపంచం కోలుకుంటోంది. రకరకాల వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో సాధారణ స్థితికి చేరుకుంటుంది. అయితే కొవిడ్ కు సంబంధించి ఎటువంటి వార్త అయినా, అంశమైనా ఇప్పుడు ప్రత్యేకమే. తాజాగా అటువంటి అంశమే ఒకటి బయటకు వచ్చింది. కొవిడ్ సోకిన వారు ప్రత్యేకంగా పరీక్ష చేసుకోనవసరం లేదన్నదే ఈ వార్త. కొవిడ్ జాడను ఇట్టే పసిగట్టే నూతన స్మార్ట్ ఫోన్ యాప్ ను శాస్త్రవేత్తలు అభివృద్ది చేశారు.కృత్రిమ మేథో సంపత్తితో ప్రపంచానికి అత్యాధునిక వైద్య పరికరాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘మనిషి గొంతు విని అతడికి కొవిడ సోకిందో లేదో యాప్ చెప్పగలదు. కొవిడ్ ర్యాపిడ్ టెస్ట్ కంటే మెరుగైన , ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలు ఈ యాప్ ఇవ్వగలదు. ఎలాంటి ఖర్చు లేకుండా త్వరగా, సులభంగా కొవిడ్ జాడను పసిగట్టగలదు ఈ యాప్. వాయిస్ రికార్డు చేసి చెక్ చేస్తే క్షణాల్లో కొవిడ్ రిపోర్టు మీ ముందు ఉంచుతుంది, మనలాంటి దేశానికి ఇది ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల ధ్రువీకరణ..
స్పెయిన్ లోని బార్సిలోవా నగరంలో ఇటీవల నిర్వహించిన యూరోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ లో ఈ యాప్ సంబంధిత వివరాలను నిపుణులు వెల్లడించారు. ఆర్టిఫీషియల్ ఇంటల్ జెన్స్ తో 89 శాతం కచ్చితత్వంతో మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు ధ్రువీకరించారు. సాధారణంగా కొవిడ్ వచ్చిన వ్యక్తిలో స్వరపేటికలు, శ్వాసమార్గం ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. దాంట్లో వచ్చే మార్పులను ఈ యాప్ ప్రధానంగా గుర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ బాధితులను గుర్తించడాని ఇదో అత్యాధునిక సాధనంగా యాప్ ఉంటుందని భరోసానిస్తున్నారు. యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో తేవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

శాంపిల్ సేకరణ సక్సెస్..
ఇప్పటికే యాప్ ద్వారా అనేక ప్రయోగాలు పూర్తిచేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్ లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్థతులైన 4,352 మందికి చెందిన 893 శాంపిళ్లను సేకరించారు.ఇందులో 308 మంది కొవిడ్ బాధితుల వాయిస్లు బయటకు వచ్చాయి. వారికి అదే సమయంలో పాత పద్ధతితో కొవిడ్ పరీక్ష చేసినా అదే స్థాయిలో ఫలితాలు వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు.యాప్ టెస్టులో భాగంగా మూడు నుంచి ఐదు సార్లు శ్వాస తీసుకోవాలి. మూడుసార్లు దగ్గాలి. స్క్రీన్ పై డిస్ ప్లేగా వచ్చే అక్షరాలను చదవాలి. ఆటోమేటిక్ గా కొద్ది నిమిషాల్లోనే కొవిడ్ రిపోర్టు వచ్చేస్తుంది.