RBI Withdrawn Rs 2000 Note : రూ.2 వేల నోటుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

సెప్టెంబర్‌ 30 వకూ ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునే వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో బ్యాంకులు నేటి నుంచే రూ.2 వేల నోట్లను జారీ చేయడం నిలిపివేశాయి.

Written By: Dharma, Updated On : May 20, 2023 8:16 am
Follow us on

RBI Withdrawn Rs 2000 Note : మరో సంచలన నిర్ణయానికి ఆర్బీఐ తెరతీసింది. రూ.2 వేల నోట్లు వెనక్కి తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. బ్యాంకుల్లో  నోట్లు మార్చుకోవచ్చని సూచించింది. ఇందుకు సెప్టెంబరు 30 వరకూ గడువు ఇచ్చింది. గత కొద్దిరోజులుగా పెద్దనోట్లను నిలిపివేస్తారని ప్రచారం జరుగుతోంది. దానిని నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదొక కుదుపే. గతంలో కూడా చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను రద్దుచేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లోనే రూ.2 వేల నోటు చలామణిలోకి వచ్చింది.

మరోసారి జనం బ్యాంకుల వద్ద క్యూకట్టే అవకాశముంది. అప్పట్లో పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. 2016 నవంబర్ 8వ తేదీ సాయంత్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వయంగా దేశ ప్రజలకు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద నోట్లు చెల్లకపోవడంతో, పాత నోట్లను మార్చుకోవడానికి, చిన్న నోట్లు తీసుకోవడానికి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు జనం క్యూకట్టారు. నోట్లు మార్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.

ఇప్పుడు తాజాగా రూ.2 వేల నోట్లపై అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై రూ.2 వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. ఈ నోట్ల మార్పిడి మే 23 నుంచి మార్చుకునే అవకాశం ఉందని తెలిపింది. ఒక విడతలో 20 వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉందని, 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్‌ 30 వకూ ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునే వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో బ్యాంకులు నేటి నుంచే రూ.2 వేల నోట్లను జారీ చేయడం నిలిపివేశాయి.