MP Avinash Reddy Hospitalized : ఈ సిల్లీ రీజన్స్ ఏంటి? ఆస్పత్రిలో చేరిన అవినాష్ రెడ్డి

ఇక్కడ అవినాష్ రెడ్డి చెప్పే సిల్లీ రీజన్స్ కాకుండా .. సీబీఐ ఇమేజ్ కూడా ప్రధాన అంశం అవుతుంది. విచారణకు సహకరించని ఓ ఎంపీని అరెస్ట్ చేయలేరా అన్న ప్రశ్న ప్రధానంగా వస్తుంది. అందుకే వారు ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. 

Written By: Dharma, Updated On : May 19, 2023 7:40 pm
Follow us on

MP Avinash Reddy Hospitalized : ఏపీలో వైఎస్ కుటుంబానికి ఓ బ్రాండ్ ఉంది. ఆ కుటుంబ ధైర్య సాహసాలు గురించి చెప్పనక్కర్లేదు. అప్పట్లో బలమైన ఢిల్లీ పీఠానికి వ్యతిరేకంగా పావులు కదిపిన చరిత్ర ఆ కుటుంబానిది. అటు వైఎస్, జగన్ అదే పంథాను కొనసాగించారు. తమకు తాము బలమైన నాయకులుగా తీర్చిదిద్దుకున్నారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన అవినాష్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వివేకా హత్య కేసు విచారణలో సిల్లీ రీజన్స్ తో తప్పించుకొని తిరుగుతున్నారు. సీబీఐ అరెస్టు చేయాలనుకుంటే ఇవాళ కాకున్నా.. రేపైనా తప్పదు అన్న సూత్రాన్ని మరిచి చిన్నపిల్లాడి చాక్లెట్ తగదాలా మార్చేస్తున్నారు. ఇప్పుడు తల్లి ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని విచారణకు డుమ్మా కొట్టడం సొంత పార్టీ శ్రేణులకే విస్మయపరుస్తోంది. తల్లితో పాటు తాను కూడా హాస్పిటల్ లో అడ్మిట్ కావడం ఓకింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

ఇదే సీబీఐ, ఈడీ నమోదుచేసిన కేసుల్లో సీఎం జగన్ పదహారు నెలల పాటు జైలలో ఉన్నారు. అదే ఆయనకు దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది. తండ్రిలేని పిల్లాడిని ఇబ్బందిపెడుతున్నారని ఏపీ జనం అక్కున చేర్చుకుంది. అప్పటి వరకూ రాజకీయంగా జగన్ చేసిన పోరాటం లేదు. ప్రజా ఉద్యమం అంతకంటే కనిపించదు. పైగా లక్షల కోట్ల అవినీతి చేశారన్న అపవాదు సైతం ఆయన వెంట ఉంది. అయినా సరే జనం జైలుపాలు చేశారన్న సానుభూతితో అండగా నిలిచారు. ఇప్పటికే ఆ జైలు జీవితం ఎపిసోడ్ ను తీసుకునే ఢిల్లీ పీఠాన్ని ఎదిరించిన మొనగాడు, ధీరుడు వంటి మాటలతో జగన్ ను పార్టీ శ్రేణులు, అభిమానులు ఆకాశాన్ని ఎత్తేస్తుంటారు. అటువంటి వారు ఇప్పుడు అవినాష్ రెడ్డిని చూసి మాత్రం లోలోపల అసహ్యించుకుంటున్నారు.

వివేకా హత్య కేసులో సహ నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఆయన లేవనెత్తిన అంశాలపై సైతం విచారణ చేపట్టింది. అతను విచారణ చేయాలన్న వారి నుంచి వివరాలు సేకరించింది. అయినా సరే అవినాష్ వైపే సీబీఐ చూస్తుందంటే అక్కడ స్ట్రాంగ్ అవిడన్స్ ఉన్నట్టే కదా.  అటువంటప్పుడు విచారణో.. అరెస్టో ఏదో ఒకటి తప్పదు. తండ్రి భాస్కర్ రెడ్డి వరకూ వచ్చింది.. తనదాకా రాకూడదు అని అవినాష్ రెడ్డి ఎందుకు భావిస్తున్నారో అర్ధం కావడం లేదు. అరెస్ట్ చేస్తారో లేదో కానీ సీబీఐ విచారణకు మాత్రం సహకరించడం లేదు. ఇదిగో వస్తా అని కోర్టులకు వెళ్లడం.కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయని విచారణకు వెళ్లకపోవడం వంటివి చాలా చేశారు.

ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు తల్లిని అడ్డం పెట్టుకున్నారు. ఉదయం పులివెందుల ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. అవినాష్ రెడ్డి ఆ కారణం చెప్పి పులివెందు బయలుదేరారు. సీబీఐ అధికారులు కూడా వెనకే రావడంతో తల్లిని అంబులెన్స్‌లో ఎదురు వచ్చేలా చేయించుకున్నారు. తాడిపత్రి దగ్గర కలిసి.. మళ్లీ హైదరాబాద్ బయలుదేరారు. కానీ కర్నూలులోనే ఆస్పత్రిలో చేర్పించారు. తనకు కూడా కడుపు నొప్పి అని ఆస్పత్రిలో ఇన్ పేషంట్ అయిపోయారు.సీబీఐ అధికారులు కర్నూలు నుంచి వెళ్లిపోయారు. అయితే ఇవాళ అరెస్ట్ చేయకపోవచ్చు కానీ రేపు ఊరుకుంటారా అన్నదే ప్రశ్న. ఇక్కడ అవినాష్ రెడ్డి చెప్పే సిల్లీ రీజన్స్ కాకుండా .. సీబీఐ ఇమేజ్ కూడా ప్రధాన అంశం అవుతుంది. విచారణకు సహకరించని ఓ ఎంపీని అరెస్ట్ చేయలేరా అన్న ప్రశ్న ప్రధానంగా వస్తుంది. అందుకే వారు ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.