
Rapido Bike Taxi: కాలంలో పోటీ పడుతున్న మనిషి జీవన శైలి మారుతోంది. పోటీ ప్రపంచంలో వేగాన్ని అందుకోలేకపోతే.. వెనుక బడడం ఖాయం. దీనిని గుర్తించిన దేశీయ బైక్ ట్యాక్సీ సంస్థ ప్రజలకు బైక్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. తక్కువ కాలంలోనే సేవలను వేగంగా విస్తరిస్తోంది. ప్రతీ వ్యక్తికి బైక్ సేవలు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ర్యాపిడో సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో వ్యాపార వేత్తలతో ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ కార్యక్రమంలో రాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి పాల్గొన్నారు. వ్యాపార విస్తరణ, విజయ రహస్యం గురించి వెల్లడించారు.
ధీరూబాయ్ అంబానీ స్ఫూర్తితో..
దేశంలోని ప్రతి వ్యక్తి బైక్ టాక్సీ సేవను సులభంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో తాము ర్యాపిడోను ప్రారంభించామని పవన్ పేర్కొన్నారు. తన దృష్టిలో బైక్ ట్యాక్సీకి సరైన అర్థం ఉద్యోగ వికేంద్రీకరణని అన్నారు. తమ ఆలోచనతో చిన్న పట్టణాల్లో ఉపాధి కల్పించామని.. యువతకు సొంత నగరంలోనే ఉపాధి అవకాశాన్ని కల్పించగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు ధీరూభాయ్ అంబానీ పెద్ద స్ఫూర్తి తెలిపారు.
సొంత పట్టణాల్లో యువతకు ఉపాధి..
ఇక రాపిడో ద్వారా యువతకు సొంత నగరాలు, పట్టణాల్లోనే ఉపాధి కల్పించగలుగుతున్నామని పవన్ తెలిపారు. ఉపాధి అవకాశాల కోసం ఒకప్పటిలా దిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే చాలా మందికి తమ నగరాల్లోనే ర్యాపిడో ఉపాధిని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గడచిన 8 ఏళ్లలో దాదాపు 60 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యధికంగా 200 మిలియన్ బైక్‌లు ఉండగా.. దానికి మౌలిక సదుపాయాల సిద్ధం చేసేందుకు తమ వంతుగా ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు.
కనీస వేతనం రూ.10 వేలు..
ర్యాపిడో డ్రైవర్ సంపాదన ఎంత? ఒక ర్యాపిడో రైడర్ నెలకు ఎంత డబ్బు సంపాదిస్తున్నారనే ప్రశ్నకు బదులిస్తూ.. పార్ట్‌టైమ్‌గా రోజుకు నాలుగైదు గంటల పాటు రైడర్ రాపిడో బైక్ నడుపుతుంటే నెలకు రూ.10 వేలు సులువుగా సంపాదిస్తున్నారన్నారని పవన్ తెలిపారు. ఇదే సమయంలో ఫుల్ టైమ్ అంటే రోజుకు 10 గంటలు ర్యాపిడో బైక్ నడుపుతున్న వ్యక్తి నెలకు రూ.25 వేలు సంపాదిస్తున్నాడని వెల్లడించారు. ప్రస్తుతం ర్యాపిడో దేశవ్యాప్తంగా రోజూ 10 మిలియన్ రైడ్‌లను పూర్తి చేస్తోందని చెప్పారు. వీటిలో దాదాపు 50 శాతం రైడ్స్ టాప్ 7 నగరాల వెలుపల ఉన్నాయి. చిన్న పట్టణాల్లోని ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమని పవన్ అభిప్రాయపడ్డారు.

తక్కువ కాలంలోనే చిన్న పట్టణాలకూ విస్తరించిన ర్యాపిడే సేవలను ప్రజలు వినియోగించుకుంటుండగా, స్థానిక యువతకు ఉపాధి లభించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో గ్రామాలకూ విస్తరించే అవకాశం లేకపోలేదు.