Rana Naidu Review : “తెలుగు సినీ పరిశ్రమలో గత 50 ఏళ్లలో ఒకటే కథను మళ్లీ.. మళ్లీ.. కొత్త సినిమాగా తీస్తున్నారు. నటులు మాత్రమే మారుతున్నారు.” కొంత కాలం కింద ఓ ప్రముఖుడు అన్నమాట ఇది. నిజమే మరి.. ఒక హీరో ఉంటాడు.. ఆయన లైన్ వేయడానికి లేదంటే.. ఆయన్నే లైన్లో పడేయడానికి ఓ హీరోయిన్. పంచాయితీ పెట్టుకోవడానికి ఓ తలకుమాసిన రౌడీ. వీడ్ని ఓడించడమే క్లైమాక్స్. హథవిధీ.. ఎన్ని సినిమాలూ.. ఎంతటి మురిగిపోయిన, అరిగిపోయిన మూస..?
ఈ స్టేట్ మెంట్ అర్థమైన ఫ్యాన్స్ కు.. చండ్రకోల తీసుకొని ఫెడేల్.. ఫెడేల్ మని వీపు వాచిపోయేలా బాదినట్టుగా ఉంటది. కానీ.. మన వీరాభిమానులకు అర్థమై చావదే. అసలు అభిమాని అనే ఆ బుర్రకు ఆలోచనా శక్తి ఉంటే కదా? అభిమానం హద్దులు దాటి.. ఏనాడో ఆరాధనా స్థాయికి చేరింది. ఇప్పుడు అదో మానసిక బానిసత్వం. అందులోనే వాళ్లకు హాయి. వరాహాలు మడుగులో దొర్లాడినట్టు.
ఏదైనా.. పతాక స్థాయికి చేరినప్పుడు.. ఆధిపత్య రూపం తీసుకుంటుంది. అప్పుడు తాను అనుకున్నదే జరగాలని ఆదేశిస్తుంది. తెలుగునాట ఈ వెర్రి అభిమానం కూడా అదే స్థితిలో ఉందిప్పుడు. “సార్.. హీరోను అలా చూపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకోరు సార్. భలేవారే హీరోయిన్.. హీరోను తిడుతుందా? ఏంటీ.. హీరోగారి కాలర్ విలన్ పట్టుకుంటాడా.. అభిమానులు యాక్సెప్ట్ చేయరండీ..” వార్నీ.. కళను ఎక్కడికి తీసుకెళ్లార్రా సామీ..! “తప్పదు సార్… ఎండాఫ్ ది డే.. కలెక్షన్లే కదా సార్ కావాల్సింది. సో.. అంతే.” ఇదీ కథ. ఇదే తెలుగు సినిమా కథ.
అందుకే.. తెలుగు హీరోల్లోని అసలైన నటుడు మూసుకొని మూలన కూర్చుంటాడు. హీరో మాత్రమే సిల్వర్ స్క్రీన్ కు నెత్తురు అత్తరులా పూస్తూ .. హీరోయిన్ల బ్యాక్ ప్యాకెట్ మీద కన్నేస్తూ.. చెయ్యేస్తూ.. విలన్ల కాలూ, చేయి తీస్తూ పోతా ఉంటాడు. ఇలాంటప్పుడు.. వీరసింహారెడ్డి మెడలు కాక ఇంకేం కోస్తాడు..? వీరయ్య సిగ్నేచర్ స్టెప్పులు కాకుండా ఇంకేం వేస్తాడు. ఆఖరికి.. నక్సలైట్ ఆచార్య కూడా ఐటం పోరి నడుము పట్టుకోవాల్సి వచ్చెపో. ఎంత గతిపట్టెగదరా?
ఈ ఎర్రి అభిమాన పుష్పాలకు తెలియని సంగతి ఏమంటే.. ఇదే బాలయ్య “దేవుడు” అనే ఓ సినిమా తీశాడు గుర్తుందో..? చిరంజీవి “ఆరాధన” మూవీ చేశాడు తెలుసో? వాటిని దేఖను కూడా లేదు. ఇంకెలా వస్తాయి అలాంటి సినిమాలు?
ఇప్పుడిప్పుడే కాస్త మార్పు కనిపిస్తోంది. కానీ.. అది స్టార్లను తాకకుండా అభిమాన ముళ్ల కంచె అడ్డుకాస్తోంది. ఫాఫం.. ఆ హీరోల్లోని నటుడు ఎన్నేళ్లుగా అల్లాడిపోతున్నాడో.. కొత్త వేషం వేద్దామని. ఏం లాభం.. ఈ గొర్రెలు పక్కకు తొలగరే! ఇలాంటి మందలు పెద్దగా అడ్డులేని వెంకటేష్.. ఆ ఏడుపుగొట్టు క్యారెక్టర్లు ఎన్నాళ్లు చేస్తామని కొత్తగా ట్రై చేశాడు. అభిమానం హర్ట్ అయిపోయిందట. ఓరే.. గూట్లే అతనో నటుడు. ఈ విషయం నీ మట్టి బుర్రకీ.. పిట్ట మెదడుకీ ఎలారా అర్థం చేయించేది..?
ఇదిగో.. ఇలాంటి వాటికి భయపడే.. స్టార్లంతా ప్రయోగాలు బంద్ చేసి.. ఫార్ములా వెంట పడ్డారు. ఇప్పుడు వాళ్లు స్టార్లు మాత్రమే. సిసలైన నటులు కాదు. వాళ్లలోని నటుడిని చంపేసింది ఎవరో కాదు.. డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పుకునే నువ్వేరా వారీ. ఇది కూడా నీ కోడి చిప్పుకు అర్థం కాదు. పో.. పొయ్యి.. బస్తా నిండా కాగితాలు ఏరుకో.. రేపు రిలీజయ్యే..రొట్ట మూవీ మీద జల్లుకుందువుగానీ..
-రాధా