
Steven Spielberg- Rajamouli: లెజెండరీ దర్శకులు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకధీరుడు రాజమోళి మధ్య సంభాషణ చోటు చేసుకుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ ని రాజమౌళి ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై స్టీవెన్ స్పీల్బర్గ్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ నేను చూశాను. మీ టేకింగ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి పాత్ర ప్రత్యేకంగా నిలిచాయి. చూస్తున్నంత సేపు నా కళ్ళను నేను నమ్మలేకపోయానని ఆయన అన్నారు. మీ మాటలకు కుర్చీలో నుండి లేచి డాన్స్ చేయాలనిపిస్తుందని రాజమౌళి తన సంతోషం తెలియజేశారు.
స్టీవెన్ స్పీల్బర్గ్ లేటెస్ట్ మూవీ ది ఫేబుల్ మాన్స్ గురించి రాజమౌళి ఆయన్ని అడిగి తెలుసుకున్నారు. ది ఫేబుల్ మాన్స్ మీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. అది మీ ఆటోబయోగ్రఫీ అని చాలా మందికి తెలియదు. మీ గురించే కాకుండా మీ తల్లిదండ్రుల గురించి ప్రపంచానికి తెలియజేశారని రాజమౌళి అన్నారు. ఇప్పటి వరకు ఇతరుల కథలు చెప్పాను. ఈసారి నా కథ సినిమా ద్వారా చెప్పాలి అనుకున్నాను. ఆ ఆలోచనలో నుండి పుట్టిందే ది ఫేబుల్ మాన్స్. నా పేరెంట్స్, సిస్టర్స్ గురించి, దర్శకుడిగా ఎదిగే క్రమంలో ఎదురైన ఇబ్బందులు నిజాయితీగా చెప్పాలనుకున్నాను. మా అమ్మ వ్యక్తిత్వం చాలా గొప్పది. అందుకే ఆమె గురించి ఎక్కువగా సినిమాలో ప్రస్తావించానని స్టీవెన్ స్పీల్బర్గ్ అన్నారు.
ది ఫేబుల్ మాన్స్ మూవీలో ఒక సన్నివేశం హృదయాన్ని తాకిందని రాజమౌళి అన్నారు. నా జీవితంలో చాలా నాటకీయత ఉంది. మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. నా వద్ద ఓ చిన్న కెమెరా ఉండేది. దాంతోనే సినిమా తీయాలి అనుకునేవాడిని. దర్శకుడిగా ఎదిగే క్రమంలో నేను పడ్డ ఇబ్బందులు సామ్యేల్ పాత్ర ద్వారా చెప్పాను, అన్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి మీరిచ్చే సలహా ఏమిటని రాజమౌళి అడిగారు.

ఫోన్ కెమెరాతో కూడా సినిమా తీసే సాంకేతికత ఇప్పుడు అందుబాటులో ఉంది. సినిమా బడ్జెట్, షెడ్యూల్స్ విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. నిపుణులు, అనుభవజ్ఞులు చెప్పే సలహాలు పరిగణలోకి తీసుకోవాలి. తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలి. సినిమా అనేది సమష్టి కృషి.. అని స్టీవెన్ స్పీల్బర్గ్ అన్నారు. ది ఫేబుల్ మాన్స్ మూవీ ఇండియాలో ఫిబ్రవరి 10న విడుదలైన నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు.
