
Ponguleti Srinivasa Reddy- Jagan: రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాలు తీరిన తర్వాత తెగదెంపులే ఉంటాయి. ఇందుకు ఎవరూ అతీతం కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి ఎపిసోడ్ కూడా అలాంటిదే కాబట్టి.. మొదట్లో జగన్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి, తర్వాత ఎంపీగా గెలిచిన అనంతరం భారత రాష్ట్ర సమితి లో చేరారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.. అయితే అప్పట్లో ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు జగన్ ఆశీర్వాదం కూడా తీసుకున్నారని సమాచారం.. ఇప్పటిదాకా కూడా జగన్ తో సత్సంబంధాలు నడుపుతున్నట్లు సమాచారం. అయితే పొంగులేటి భారత రాష్ట్ర సమితిని వీడడం వెనుక జగన్ ఉన్నాడని, షర్మిల పార్టీ ని తెలంగాణలో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఆదేశించినట్టు సమాచారం.. అందులో భాగంగానే శ్రీనివాసరెడ్డి భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధిష్టానంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో పొంగులేటి బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ఆయన అనుచరులు లీక్ లు ఇచ్చారు..కానీ ఆయన మాత్రం ఏ పార్టీలో చేరకుండా సైలెన్స్ గా ఉన్నారు. పైగా షర్మిల,విజయమ్మ తో వరుస గా భేటీలు అవుతున్నారు. శుక్రవారం జగన్ తో కూడా భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పొంగులేటి ఖమ్మలో విస్తృతంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే వైరా, అశ్వారావుపేట నియోజక వర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు.. శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో పువ్వాడ అజయ్ మీద పోటీ చేసే అవకాశం ఉంది. మరో వైపు పాలేరు లో షర్మిల పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పొంగులేటి ఆమెకు అంతర్గతంగా సహాయ సహకారాలు అందజేస్తున్నట్టు తెలుస్తున్నది.

తెర పైన జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్నట్టు కనిపిస్తున్నా.. తెర వెనుక మాత్రం వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తనతో అనుబంధం ఉన్న నాయకులను అందులో చేరుస్తున్నారని సమాచారం. ఇక పొంగులేటి కి ఏపీలో పలు కాంట్రాక్టులు ఇచ్చాడు జగన్. పైగా జగన్ కు సన్నిహితుడయిన వ్యక్తి తో శ్రీనివాస రెడ్డి వియ్యం అందుకున్నారు. ఇన్ని సమీకరణాలు కుదరడంతో పొంగులేటి జగన్ ఫోల్డ్ లోకి మళ్ళీ వెళ్ళారని, అందుకే లోపాయికారిగా షర్మిలకు జై కొడుతున్నారని సమాచారం.
