Subhash Patriji Passed Away: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పిరమిడ్ ధ్యాన కేంద్రం ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం ఆరోగ్యం సహకరించకపోవడంతో దేవుడిలో మమేకమయ్యారు. కొద్ది రోజులుగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటున్న ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో బెంగుళూరు ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితిలో మార్పు లేదు. అందుకే సాయంత్రమే ఆయనను ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆశ్రమంలోనే సాయంత్రం ఆయన శ్వాస అనంత వాయువుల్లో కలిసిపోయింది.

సుభాష్ పత్రిజీ నిజామాబాద్ లోని బోధన్ లో 1947 సంవత్సరంలో జన్మించారు. కర్నూల్ లోని కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థలో చాలా ఏళ్లు పనిచేశారు. 2012లో కడ్తాల్ లోని అన్మాసుపల్లిలో మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించారు. అప్పటి నుంచి అక్కడే తన సేవలు అందిస్తున్నారు. ఎంతో మందికి ధ్యానం చేయడంలో శిక్షణ ఇచ్చారు. అదే ఏడాది ప్రపంచ ధ్యాన మహాసభలు నిర్వహించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెట్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
Also Read: Droupadi Murmu: కొత్త రాష్ట్రపతికి పుట్టింటి కానుకగా ఏమి ఇచ్చారంటే
వేలాది మందిని ధ్యానం చేయడంలో శిక్షణ ఇప్పించారు. ఎంతో మందికి శ్వాసతోపాటు ధ్యాస ఉంటే ధ్యానం వస్తుందని తెలియజేశారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చేశారు. తన ప్రవచనాలతో ఎంతో మందిని తన వైపు మళ్లించారు. ఆశ్రమంలో చేరిన వారికి ధ్యాన మార్గంలో కలిగే లాభాల గురించి విశదీకరిస్తూ శిష్యులను ధ్యాన మార్గంలోకి రప్పించడమే ఆయన ధ్యేయం. ఇలా దాదాపు నలభై ఏళ్ల పాటు ధ్యానంలో అందరిని ఐక్యం చేయడంలో కృతకృత్యులయ్యారు.

మొదట్లో ఓ బహుళ జాతి కంపెనీలో ఉద్యోగం సంపాదించినా ఆయన దృష్టంతా ఎప్పుడూ ధ్యానం మీదే ఉండేది. మనిషి ధ్యానం చేయడం ద్వారా ఎన్నో లాభాలు పొందుతాడని నిరూపించడానికి పిరమిడ్ ఆశ్రమాన్ని స్థాపించారు. 1980లోనే ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో ఈ పిరమిడ్ ఆశ్రమాన్ని స్థాపించి తన శిష్యులతో అందరికి ధ్యానం చేయడాన్ని ఓ అలవాటుగా చేశారు. దీంతో వారు ఉదయం నుంచే ధ్యానం చేయడంలో నిమగ్నమవుతారు. స్వామీజీ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం పిరమిడ్ ధ్యాన కేంద్రంలోనే నిర్వహించనున్నట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.
Also Read:Heavy Rains in Telangana: కుండపోత వానలు గుండెకోతను మిగుల్చుతున్నాయా?