Jharkhand : పిల్లల మనసు కల్మషం లేనిదంటారు. పిల్లలు తప్పు చేస్తే కచ్చితంగా పరిస్థితుల ప్రభావం ఉంటుంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల నడవడిక సైతం పక్కదారి పట్టిస్తుంది. తెలిసీ తెలియని వయసలో పిల్లల తప్పులను ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరముంది. దాని వెనుక ఉండే లోతైన కారణాలను అన్వేషించాలి. కానీ రూ.5 వేలు దొంగతనం చేశారని ఇద్దరి పిల్లలపై అమానుషత్వం ప్రదర్శించారు. అరగుండు చేసి చెప్పుల దండతో నాలుగు గంటల పాటు నరకయాతన చూపించారు. పసి మొగ్గలపై తమ కర్కశత్వాన్ని చూపారు.
జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పది సంవత్సరాల్లోపు వయసున్న బాలురు దొంగతనానికి పాల్పడ్డారు. రూ.5 వేలు చోరీ చేశారు. దీనిని గమనించిన ఓ మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఒక బాలుడు తప్పించుకున్నాడు. అయితే దొరికిపోయిన బాలుడు ఇచ్చిన సమాచారంతో రెండో బాలుడ్ని కూడా రప్పించారు. కఠిన శిక్షను అమలుచేశారు.
వీధి మధ్యలోకి పిలిపించారు. ఇద్దరు పిల్లలకు అరగుండు చేయించారు. వారి మెడలో చెప్పులదండ వేశారు. అంతటితో ఆగకుండా బురదలో నాలుగు గంటలపాటు నిల్చోబెట్టారు. ఆ పసి మొగ్గలు ఆపసోపాలు పడినా వినలేదు. ఇబ్బందిపడుతున్నామని కన్నీటిపర్యంతమైనా చెవికెక్కించుకోలేదు. పైగా పిల్లలపై కొందరు గ్రామస్థులు పనికిరాని సామాన్లు విసిరారు. అయితే ఈ అమానుష చర్యపై సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. బాలురిద్దర్నీ బంధ విముక్తలను చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆరుగురిపై కేసు నమోదుచేశారు. గతంలో ఆ బాలురు చాలా సార్లు దొంగతనాలు చేసి దొరికిపోయారని.. మందలించినా ప్రవర్తన మార్చుకోకపోవడం వల్లే చర్యలకు దిగినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.