Viral Video: నేటి ఆధునిక కాలంలో వివాహం పూర్తిగా మారిపోయింది. ఫంక్షన్ హాల్లో పెళ్లి.. క్యాటరింగ్ వాళ్ల చేతికి భోజన బాధ్యతలు.. ఈవెంట్ వాళ్లకు డెకరేషన్, డీజే బాధ్యతలు..ఇలా పెళ్లి అనేది గంటల్లో ముగిసే తంతుగా మారింది. ఫలితంగా ఎటువంటి అనుభూతి లేకుండానే.. ఎటువంటి జ్ఞాపకాలు లేకుండానే.. ఎటువంటి హడావిడి లేకుండానే పెళ్లి ముగుస్తోంది. దీనికి కారణాలు ఇవీ అని చెప్పడం సాధ్యం కాదు. కాకపోతే సంస్కృతి సాంప్రదాయాలు కాస్త మరుగున పడిపోయి.. పాశ్చాత్య ధోరణి మాత్రం చాప కింద నీరు లాగా విస్తరిస్తోంది. ఫలితంగా మామిడి తోరణాల స్థానంలో ప్లాస్టిక్ పువ్వులు కనిపిస్తున్నాయి. ఐరెన్లు పట్టే సందర్భంలో డీజే మూతలు వినిపిస్తున్నాయి. ఎదుర్కోలు వేడుక జరిగే సమయంలో అనవసరపు రాద్ధాంతాలు చోటుచేసుకుంటున్నాయి. మొత్తంగా పెళ్లి అనేది గొప్పగా చెప్పుకునే వేడుక దగ్గర నుంచి.. జస్ట్ గంటల్లో ముగిసే తంతులాగా మారిపోయింది.
Also Read: కొత్త జంట చైతు-శోభిత సాహసాలు… రేస్ ట్రాక్ మీద దూసుకెళ్లిన స్టార్ కపుల్!
వీళ్లది ఎంత అదృష్టమో
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో.. పాతకాలపు నాటి వివాహ సాంప్రదాయాన్ని గుర్తు చేస్తోంది. మనం మర్చిపోయిన మన సంస్కృతిని కళ్ళముందు ఉండేలా చేస్తోంది. అక్కడ డీజే మోతలు లేవు. ఫంక్షన్ హాల్ కృతకపు ఆకృతులు లేవు. ఐరెన్ కుండల మట్టి వాసన.. అమ్మలక్కలు దంచిన పసుపు సువాసన.. మామిడి తోరణాల పచ్చదనం.. అయిన వాళ్ళ పలకరింపులతో కమ్మదనం.. తాటాకు పందిళ్లతో నిండుదనం ఆడుగడుగునా కనిపించింది. అంతేకాదు పెద్ద పెద్ద బాసికాలు.. వధువు ధరించిన పసుపు పచ్చని చీర.. వరుడు ధరించిన తెల్లని ధోవతి, చొక్కా వెనకటి కాలం నాటి సాంప్రదాయాలను గుర్తు చేశాయి. ఇక ఊరేగింపు అయితే మహా గొప్పగా సాగింది. ఎడ్ల బండిమీద వధువు, వరుడు వస్తుండగా బంధు పరివారం మొత్తం వారి వెంట నడిచింది. వారికి ఘనమైన అప్పగింతలను పలికింది. ఈ క్రతువు చూస్తుంటే గొప్పగా అనిపించింది. మర్చిపోయిన మన సంస్కృతిని గుర్తు చేసింది. వద్దనుకున్న మన సంప్రదాయాన్ని కనుల ముందు ఉంచింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ జంటను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఎంతో అదృష్టం చేసుకున్నారని పేర్కొన్నారు..”ఎంత గొప్ప వేడుక.. ఎంత గొప్ప వివాహం.. అద్భుతం అనే మాటలు సరిపోవడం లేదు. జంట పెట్టి పుట్టి ఉంటారు కాబోలు.. లేకపోతే మనం మర్చిపోయిన సంప్రదాయాన్ని.. మనం మర్చిపోయిన సంస్కృతిని వీళ్లు గుర్తుంచుకున్నారంటే మామూలు విషయం కాదు. పైగా వారి పెళ్ళిలో ప్రతి సందర్భంలోనూ వెలుగులోకి తెచ్చారు. వారెవ్వా అనిపించారు. ఇది కదా ఈ తరానికి కావాల్సింది.. ఇది కదా ఈతరం గుర్తుంచుకోవాల్సిందే. ఆధునికత ముసుగులో మన సంప్రదాయాన్ని మనమే మర్చిపోతే అంతకుమించిన దారుణం మరొకటి ఉండదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
View this post on Instagram