
Prakash Raj: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత, గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ. రెండేళ్ల జైలు శిక్షతోపాటు ఎంపీ పదవి కోల్పోయాడు. ఈ క్రమంలో విపక్షాలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. సినీ నటుడు, కర్ణాటకకు చెందిన ప్రకాశ్‌రాజ్ కూడా రాహుల్‌కు సంఘీభావం కోసం చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయనకు కూడా రాహుల్ పరిస్థితి వచ్చేలా ఉందా అంటే అవుననే సమాధానం వస్తోంది. కర్ణాటక ఎన్నికల వేళ ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ప్రకాశ్ రాజ్ కొత్త వివాదానికి కారణమయ్యారు. ప్రధాని మోదీతో సహా మరో ఇద్దరు మోడీ ఫొటోలతో ప్రకాశ్‌రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారుతోంది. రాజకీయ రచ్చకు కారణమైంది.
బీజేపీ నేతల ఫైర్..
రాహుల్ గాంధీపైన అనర్హత వేటుతో జాతీయ స్థాయిలో బీజేపీ వర్సస్ ప్రతిపక్షాలు అన్నట్లుగా రాజకీయం మారింది. దేశ వ్యాప్తంగా సత్యా గ్రహ దీక్షలకు కాంగ్రెస్ సిద్దమైంది. రాహుల్ వ్యాఖ్యలను.. ప్రతిపక్షాల మద్దతును బీజేపీ తప్పు బడుతోంది. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జనరల్ నాలెడ్జ్ అని పోస్టు చేసిన ప్రకాశ్ రాజ్.. మూడు ఫొటోలు జత చేశారు. ఇందులో కామన్ అంశం ఏంటని ప్రశ్నించారు. లలిత్‌మోడీ, నరేంద్రమోడీ, నీరవ్‌మోడీ ఫొటోలతో ఈ ప్రశ్న సంధించారు. రాహుల్ కామెంట్స్ ను పరోక్షంగా గుర్తు చేస్తూ ప్రకాశ్‌రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా రాహుల్ కామెంట్స్.. కోర్టు తీర్పు..అనర్హత చర్చ వేళ ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
కమలనాథుల కౌంటర్..
ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ప్రకాశ్ రాజ్‌కు సమాధానంగా ట్వీట్ చేశారు. లలిత్‌మోడీ, నీరవ్‌మోడీ ఇద్దరూ కూడా కాంగ్రెస్ హయాంలోనే స్కామ్‌లు చేశారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కొని దేశం గర్వించదగ్గ నేతగా ఎదిగారని, ఈ మూడింటిలో కామన్‌గా ఉన్నది కాంగ్రెస్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

కర్నాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో ప్రకాశ్‌రాజ్ కొత్త వివాదానికి తెరలేపడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ట్వీట్ ప్రకాశ్‌రాజ్‌కంటే బీజేపీకే పాజిటివ్‌గా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ పోటీచేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ మళ్లీ వివాదాస్పద ట్వీట్‌తో వివాదంలో చిక్కుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.