CM KCR On AP BRS: లంకలో పుట్టిన వాళ్లందరూ రాక్షసులే. ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులే. పొంటికూర అనేటోడు తెలంగాణ. గోంగూర అనేటోడు ఆంధ్రా. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్న మాటలివి. తెలంగాణ ఉద్యమాన్ని రగిలించేందుకు కేసీఆర్ వాడిన అస్త్రాలివి. కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్న వేళ.. అవే మాటలు, అవే విమర్శలతో కేసీఆర్ పై రివర్స్ అటాక్ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.

ఏపీలో విస్తరణకు కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. త్వరలో విశాఖ వేదికగా బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పాత వీడియోలు విస్త్రతంగా షేర్ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రా పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ రగిల్చేందుకు ఏపీ పెట్టుబడిదారుల్ని బూచిగా చూపారు. ల్యాంకో హిల్స్, రామోజీ ఫిల్మ్ సిటీ, ఎన్ కన్వెన్షన్, అయ్యప్ప సొసైటీ భూములు ఆక్రమించారంటూ ఆరోపణలు చేశారు. కేసీఆర్ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా తీసుకురాగలిగారు. తెలంగాణ రాష్ట్రం సాధించారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పరిణామం చెందింది. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతోంది. ఇదే సమయంలో ఏపీ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు వస్తున్నాయి. సమస్య ఉంటే పాలకుల మధ్య ఉంది కానీ ప్రజల మధ్య లేదు. కానీ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలు నేరుగా ఏపీ ప్రజలకు గుచ్చుకున్నాయి. ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి. పాత కేసీఆర్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఏపీ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసిన కేసీఆర్.. ఏపీలోకి ఇప్పుడెలా వస్తారన్న ప్రశ్నలు పుడుతున్నాయి.

ఏపీలోకి బీఆర్ఎస్ ఎంట్రీని బీజేపీ, వైసీపీ మాత్రమే వ్యతిరేకించాయి. టీడీపీ, జనసేన ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఏపీలో ప్రజల్లో మాత్రం కేసీఆర్ ఎంట్రీ పట్ల వ్యతిరేకత స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పోస్టులు, వీడియోలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పాత వీడియోలు మరింతగా షేర్ అయితే.. ఏపీలో కేసీఆర్ వ్యతిరేక సెంటిమెంట్ మరింత రగిలేందుకు అవకాశం లేకపోలేదు. కేసీఆర్ మాత్రం తమ పోరాటం ఆంధ్ర ప్రజలతో కాదని, కేవలం పాలకులతోనని గతంలో కూడ చెప్పారు. ఇప్పుడ కూడ అదే విషయం చెప్పే అవకాశం ఉంది. పిడికెడు ఆంధ్ర పెట్టుబడిదారుల్ని విమర్శించాము తప్ప.. ఆంధ్ర ప్రజల్ని కాదని కేసీఆర్ ఏపీలో చెప్చవచ్చు. కానీ ఏపీ ప్రజలు కేసీఆర్ మాటల్ని ఎలా స్వీకరిస్తారు అన్న అంశం పై ఏపీ బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.