Posani Krishna Murali: అంతటి అమితాబచ్చన్ కేబీసీ చేశాడు. షారుక్ ఖాన్ కూడా చేశాడు.. సల్మాన్ ఖాన్, కన్నడ సుదీప్, తెలుగులో చిరంజీవి, నాగార్జున, నాని, ఎన్టీఆర్.. ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు జాబితా. ఎందుకయ్యా ఈ ప్రస్తావన అంటే.. బుల్లితెర అనేది ఇప్పుడు ఒక అల్టిమేట్ మార్కెట్.. ఒకప్పుడు దీనిపై చిన్న చూపు ఉండేదేమో… చాలామంది కూడా మేము సినిమాల్లో నటించాం.. సీరియళ్ళ లోకి ఎందుకు వస్తాం? అని ప్రశ్నించేవాళ్లు. ఒక వేళ అవకాశాలు లేకపోతే ఏ నిర్మాతనో, డిస్ట్రిబ్యూటర్ నో కాళ్ళా వేళ్ళా పడి చిన్నాచితకా వేషం దక్కించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ బుల్లితెర ప్రాశస్త్యం ఎంత గొప్పదో తెలిసి వస్తోంది. ఇటీవల “ప్రేమ ఎంత మధురం” అనే సీరియల్ లో సీనియర్ నటుడు, డైలాగ్ రైటర్, దర్శకుడు, కథా రచయిత అయిన పోసాని కృష్ణ మురళి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. చూసేవారికి ఆశ్చర్యమనిపించినప్పటికీ ఆయన నిర్ణయం నూటికి నూరుపాళ్లు కరెక్ట్.

ఏ వేదిక అయితేనేం
నటుడు అనే వ్యక్తికి ఏ వేదికైనా సరిపోతుంది. అంతే కానీ మా తాతలు నేతులు తాగారు. మేము మూతులు కడుక్కోము అంటే కుదరదు.. అంతటి ఐదు కోట్ల గాలోడు కూడా ఇప్పటికీ నేల మీదనే ఉన్నాడు. కుదురుగా టీవీ షోలో చేస్తున్నాడు. అనిల్ రావిపూడి కూడా ఆహా ఓటీటీ లో కామెడీ షో జడ్జిగా చేస్తున్నాడు.. వాస్తవానికి సినిమా కంటే బుల్లితెరే బలమైన మాధ్యమం. పైగా దీనికి రీచ్ కూడా ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేస్తుంది. దీనిని గుర్తించే పోసాని కృష్ణ మురళి సీరియళ్ళలోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఈటీవీ జబర్దస్త్ లో జడ్జిగా కనిపిస్తున్నారు.. తనకున్న పరిచయాలతో ఇక ముందు ఆయనకు మరిన్ని అవకాశాలు రావచ్చు.

ఉపయోగం ఉంటుందా?
పేరున్న నటులు సీరియల్స్ లో నటించడం ద్వారా రేటింగ్స్ పెరుగుతాయని వాటి నిర్మాతలు భావిస్తూ ఉంటారు. ఆ లెక్కకు వస్తే పోసాని కృష్ణ మురళి ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ లో విలన్ కు సహాయపడే లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. పోసాని నటనకు వంక పెట్టలేం గానీ.. ఆ సీరియల్ నడక బాగా లేకపోవడంతో ఇప్పటికీ దారుణమైన రేటింగ్స్ నమోదు చేస్తూ ఉంది. పోనీ పోసాని వచ్చాక ఏమైనా మారిందంటే అది కూడా లేదు. సో నటుడు ఒక్కడు మాత్రమే కాదు…కథ, కథనం, నడవడిక కూడా బాగుండాలి. అంతేకానీ సినిమాలో నటించిన నటులు సీరియల్స్ లోకి వస్తే అమాంతం అవేమి గొప్ప రేటింగ్స్ నమోదు చేయవు.. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాలో నటించిన వారు సీరియల్స్ లోకి రావడం.. అందులోనూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా నటించడం… ఒక నటుడికి కావాలిసింది ఇదే. నేల మీదనే ఉండాలి. మరీ ముఖ్యంగా నిర్మాతలకు అందుబాటులో ఉండాలి.. అప్పుడే ఏ పరిశ్రమైనా వర్ధిల్లుతుంది.. అది సినిమా అయినా…. బుల్లితెర అయినా..