BCCI Selection Committee: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కి ప్రధాన సమస్య ఎదురవుతోంది. సెక్షన్ కమిటీ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ అధికారం చేపట్టిన తరువాత చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని రద్దు చేయడంతో కొత్త కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ సెలెక్షన్ కమిటీకి తగిన వ్యక్తి మాత్రం దొరకడం లేదు. దీంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నా సమర్థులైన వారు దొరకడం లేదు. ఫలితంగా ఆటగాళ్లకు న్యాయం జరుగుతుందో లేదో అనే ఆందోళన వారిలో మొదలైంది. ఇన్నాళ్లు తమ సమర్థతకు తగిన గుర్తింపు దొరికేదని క్రికెటర్లు చెబుతున్నారు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ లేకుండా ఆటగాళ్లను ఎంపిక చేయడం సమస్యగానే మారుతుంది.

కొత్త సెలెక్షన్ కమిటీ కోసం ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంటూనే ఉన్నారు. కానీ బీసీసీఐ నిబంధనల మేరకు నడుచుకునే వ్యక్తులు మాత్రం తారసపడటం లేదు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ కు రూ. 1.25 కోట్లు వేతనంగా ఇస్తారు. సభ్యులకు రూ. కోటి జీతంగా చెల్లిస్తారు. ఈ నేపథ్యంలో బీసీసీఐకి సరైన వ్యక్తి మాత్రం కానరావడం లేదు. దీంతో సెలెక్షన్ కమిటీ ఎంపిక కాస్త రసకందాయంలో పడింది. ఎవరిని తీసుకోవాలని తర్జనభర్జన మొదలైంది. దీనికి మాజీ దిగ్గజాలు మాత్రం ముందుకు రావడం లేదు. అదో కొరకరాని కొయ్యగా భావిస్తున్నందునే ఎవరు ధైర్యం చేయడం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. మంచి నిష్ణాతులైన వారు కమిటీలో ఉంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది.
క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముంబయిలో గురువారం సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరు కూడా సమర్థులైన వారు లేకపోవడంతో సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎంపిక అంశం ఎటూ తేలడం లేదు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ చేయాలని భావిస్తోంది. దీంతో సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా మరోమారు చేతన్ శర్మ నియమితులవుతారనే వార్తలు వస్తున్నాయి. లేకపోతే కనీసం సభ్యుడిగా అయినా ఆయన తన ప్రాతినిధ్యం చేపట్టనున్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే చేతన్ శర్మ దరఖాస్తును బీసీసీఐ స్వీకరించిందని అంటున్నారు. చేతన్ శర్మ నేతృత్వంలోనే శ్రీలంక సిరీస్ కు వెళ్లే జట్టును ఎంపిక చేసింది. దీంతో చేతన్ శర్మ చైర్మన్ కావడం ఇక లాంఛనమే. సభ్యులకు సైతం రూ.కోటి పారితోషికం ఇస్తామన్నా తగిన అర్హతలున్న వారు దరఖాస్తు చేయకపోవడం ఆందోళనకు తావిస్తోంది. బీసీసీఐ చైర్మన్, సభ్యుల పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను కుదించి అందులో పనికొచ్చే వారిని తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.