
Ponguleti Srinivas- KCR: భారత రాష్ట్ర సమితి సస్పెండ్ చేసిన తర్వాత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వరం మరింత పెంచుతున్నారు. కెసిఆర్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. గతంలో తనకు ఎటువంటి హామీలు ఇచ్చారు, తర్వాత వాటిని ఎలా విస్మరించారు, ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు, తన ఆత్మ గౌరవానికి ఎక్కడ భంగం కలిగించారు? వీటన్నింటి పైనా శ్రీనివాసరెడ్డి నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. గతంలో గుంబనంగా మాట్లాడే శ్రీనివాసరెడ్డి.. ఈసారి మాత్రం కెసిఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సిపి నుంచి తాను ఎంపీగా ఎన్నికయ్యాను. ఖమ్మంలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాను. అంతకుముందే కేటీఆర్ నన్ను సంప్రదించారు. మా పార్టీకి ఆశించిన మెజార్టీ రాకపోవచ్చు. మీ సహకారం మాకు కావలసి ఉంటుంది. కాబట్టి మాకు సపోర్ట్ చేయాలి” అని అప్పట్లో అడిగారని పొంగులేటి గుర్తు చేశారు.” నాతోపాటు నేను గెలిపించుకొని ఎమ్మెల్యేలను భారత రాష్ట్ర సమితిలో చేరాలని కోరారు. దానికి నేను అంగీకరించాను. అలా పార్టీలో చేరాను. నేను పార్టీలోకి వెళ్ళిన కొత్తలో భారత రాష్ట్ర సమితి సీనియర్ ఎంపీలు నాతో సరదాగా మాట్లాడేవారు.. కేసీఆర్ నీకు ఇప్పుడు ప్రియారిటి ఇస్తాడు. కొత్త అల్లుడి మురిపెం ఆరు నెలలకు మించి ఉండదు. రేపటి నాడు నీ పరిస్థితి కూడా ఇంతే.” అని వ్యాఖ్యానించారని పొంగులేటి గుర్తు చేసుకున్నారు.
పార్టీలోకి నేను వెళ్ళినంత మాత్రాన నాకేం కాంట్రాక్టులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఇచ్చారని గుర్తు చేశారు.. అందులోనూ కేసీఆర్ కు వాటా ఇచ్చానని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటా విషయంలో కేసీఆర్ అసలు వెనక్కి తగ్గరని, అలా వేల కోట్లకు ఎదిగిపోయారని పొంగులేటి వివరించారు.. అలా సంపాదించిన డబ్బుతోనే దేశంలో ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారని పొంగులేటి కుండబద్దలు కొట్టారు. ఇండియా టుడే జర్నలిస్ట్ రాజ్ దీప్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని పొంగులేటి వివరించారు.

కెసిఆర్ ను ఒక తండ్రిగా భావించానని, కానీ తడిగుడ్డతో నా గొంతు కోశారని పొంగులేటి ఆరోపించారు. 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం జగన్ మోహన్ రెడ్డితో ఫోన్ చేయించానని, అయినప్పటికీ నాకు టికెట్ ఇవ్వలేదని పొంగులేటి వివరించారు. ఏ పార్టీ నుంచో వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పలు సందర్భాల్లో రాజ్య సభ, ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పారని, వేటిని కూడా నిలుపుకోలేదని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ బతిమిలాడితేనే నేను పార్టీలో ఉన్నానని, ఇంకా ఆత్మ గౌరవాన్ని చంపుకోవడం ఇష్టం లేక బయటకి వచ్చేసానని పొంగులేటి వ్యాఖ్యానించారు. పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.