
Ponguleti Srinivas – Jupalli Krishna: భారత రాష్ట్ర సమితి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, జూపల్లి కృష్ణారావును సస్పెండ్ చేసి వారం దాటుతోంది. ఇంతవరకు వీరిద్దరూ తమ రాజకీయ ప్రయాణం గురించి, చేరాబోయే పార్టీ గురించి ఇంతవరకు నోరు విప్పలేదు. అయితే పొలిటికల్ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరూ ఒకే వేదిక మీద మాట్లాడినప్పటికీ వేరువేరు పార్టీల్లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్నది.
కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించే సందర్భంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఒకే వేదికను పంచుకున్నారు. ఇద్దరూ కూడా కెసిఆర్ కు వ్యతిరేక స్వరం వినిపించారు. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. భారత రాష్ట్ర సమితిలో ప్రజాస్వామ్యం అనేది లేదని దుయ్యబట్టారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం వీరిద్దరూ కలిసి ఒకే పార్టీలోకి వెళ్తారని అంచనాకు వచ్చారు. అని ఇక్కడే వీరిద్దరూ ట్విస్ట్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈయనను కొప్పుల రాజు ఆధ్వర్యంలోని రాహుల్ గాంధీ టీం కలిసిందని ప్రచారం జరుగుతోంది. అయితే సీట్ల విషయంలో ఒక అంగీకారం కుదరకపోవడంతో ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే ఖమ్మంలో భారతీయ జనతా పార్టీకి ఆశించినంత మేర బలం లేకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆయన అభిమానులు అంటున్నారు. ఒకవేళ బిజెపిలో చేరితే మైనార్టీ ఓటు బ్యాంకు దూరం అవుతుందని, దానికి పొంగులేటి ఇష్టపడరని ఆయన వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు.

జూపల్లి కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. గతంలో డీకే అరుణతో పడకపోవడం వల్లే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు. భారత రాష్ట్ర సమితిలో చేరారు. తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే యాదృచ్ఛికంగా హర్షవర్ధన్ రెడ్డి భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఇక అప్పటినుంచి కొల్లాపూర్ నియోజక వర్గంలో హర్షవర్ధన్ రెడ్డి, కృష్ణారావుకు పొసగడం లేదు.. దీంతో ఈ విషయాన్ని కృష్ణారావు అధిష్టానానికి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు తన శత్రువు డీకే అరుణ కూడా ఫోన్ చేసి కృష్ణారావుతో మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈనెల 23న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాలని కృష్ణారావు నిర్ణయించుకున్నారు. కృష్ణారావు రాకతో ఉమ్మడి మహ బూబ్ నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
పొంగులేటిని కూడా పార్టీలోకి ఆహ్వానించాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు యోచిస్తున్నారు. ఇప్పటికే ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఒక బృందం శ్రీనివాసరెడ్డిని కలిసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ భేటీలో ఏం జరిగిందనేది బయటికి తెలియడం లేదు.. కృష్ణ రావు తో పాటు పొంగులేటిని కూడా చేర్చుకుంటే పార్టీకి మరింత బలం వస్తుందని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. దీనిపై పొంగులేటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.