Troll Of The Day: నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. ఈ సామెతను వెనుకటి రోజుల్లో బాగా చెప్పుకునేవారు. ఇప్పుడు కాలం మారింది కనుక… మనం జీవిస్తున్నది సోషల్ మీడియా రోజుల్లో కనుక… భాష తెలియని నోరు, భాష పలకలేని నాలుక ఎలాంటి పదాన్నయినా చేతితో టైప్ చేయిస్తుంది. తర్వాత నాలుక కరుచుకుంటుంది.. ఇది సెలబ్రెటీల విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో ప్రతిసారి నిరూపితమవుతూనే ఉంది. ఎటోచ్చి ఆ రాజకీయ నాయకులే తమ శైలి మార్చుకోరు.. ఇక సెలబ్రిటీల గురించి చెప్పాల్సిందేముంది.

భాష తెలిస్తే కదా!
సాధారణంగా ద్రవిడ భాషల్లో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. దీనిని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. కానీ దురదృష్టవశాత్తు తెలుగు కు రాజకీయ నాయకుల రూపంలో గ్రహణం పట్టుకుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ స్కూళ్లల్లో చదివిస్తుండడంతో తెలుగు మరింత అగాధం లో పడిపోతున్నది. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా బిజెపి నాయకుడు, ఒకప్పటి టిఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన ట్వీట్ నవ్వుల పాలు చేసింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ట్విట్ చేయబోయి…”నూతన సమంత శుభాకాంక్షలు” అని రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు ఆయనను ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ నాయకులు అయితే “సమంత ఒక్కరేనా? సాయి పల్లవి కూడా కావాలా” అంటూ ట్రోల్ చేశారు.
భాష మీద గౌరవం ఎక్కడిది
సాధారణంగా తెలుగు భాషలో రెండు క్రియా పదాలు ఒకే చోట పలకవు. కానీ రాజకీయ నాయకులు మాట్లాడే భాషలో “చెప్పడం జరిగింది.. రావడం జరిగింది.. వివరించడం జరిగింది”… అనేవి సర్వసాధారణంగా వస్తాయి.. రెండు క్రియా పదాలు ఒకే చోట రావని కనీస స్పృహ లేని రాజకీయ నాయకులు ఉండటం తెలంగాణ చేసుకున్న దురదృష్టం. ఇక బూతుల విషయంలో ఆలవోకగా మాట్లాడగలిగే నాయకులు… భాష విషయంలో మాత్రం కొంచెం కూడా జాగ్రత్తలు పాటించరు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను ఇతర వ్యక్తుల చేత నిర్వహిస్తూ ఉంటారు. కొంత మంది నాయకులు తమ ట్విట్టర్ ఖాతాలను సొంతంగా హ్యాండిల్ చేసుకుంటారు. ఈ హ్యాండిల్ చేసే విధానంలో పొరపాట్లు చేసి నవ్వుల పాలవుతుంటారు. ఆమధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సంబంధం లేని ఓ ఫోటో ను ట్వీట్ చేసి నవ్వుల పాలయ్యారు. కాంగ్రెస్ నాయకులు ఎక్కడో ఇతియోపియాలో జరిగిన సమావేశానికి సంబంధించిన ఫోటోను రాహుల్ గాంధీ జోడో యాత్రకు వచ్చిన జనమని చూపించే ప్రయత్నం చేశారు.. కానీ తీరా చెక్ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
విషయ పరిజ్ఞానం లేదు
ఒక అంశం గురించి మాట్లాడాలి అంటే లోతైన పరిజ్ఞానం ఉండాలి. లేదా దాని గురించి తెలిసి అయినా ఉండాలి. కానీ వీటిని రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనివల్ల అసలు విషయం మరుగునపడి… కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి.. తాజాగా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన ట్వీట్.. ట్రోల్ కు గురయింది. పనిలో పనిగా సమంతను, సాయి పల్లవికి గురించి చర్చించేలా చేసింది. ముందుగానే మనం చెప్పినట్టు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది…అలాగే టచ్ కు అలవాటు పడిన వేలు దేన్నైనా టైప్ చేస్తుంది. కానీ ఈ రెండు విషయాల్లోనే మనిషికి ఉండాల్సింది కానీ స్పృహ.. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత.