Kadapa District: ఒక చిన్న ఆలోచన ఒక మనిషి ప్రాణాన్ని కాపాడింది. సకాలంలో పోలీసులు చూపిన చొరవ ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. కడప జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బద్వేలు పట్టణంలో రమేష్ అనే వ్యక్తి విద్యుత్ శాఖ లైన్మెన్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవల అధికమవడంతో రమేష్ మనస్థాపానికి గురయ్యాడు. ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. చనిపోయే ముందు చివరిసారిగా కుమారుడు తో మాట్లాడాడు. మరికొద్ది సేపట్లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. రైలు పట్టాలపై ఉన్నట్టు సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా ఆందోళన ప్రారంభమైంది.
ఇటువంటి సమయంలో రమేష్ కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. తన తండ్రి ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపాలని నిర్ణయించుకున్నాడు. తన మదిలో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే 100 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. తన తండ్రి ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నాడని.. ఎలాగైనా తనను కాపాడాలని వేడుకున్నాడు.దీంతో సిద్ధవటం ఎస్ఐ వెంటనే స్పందించారు.సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా రమేష్ ఎక్కడ ఉన్నాడో గుర్తించారు.
కనుమలోపల్లి రైల్వే ట్రాక్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే రైలు పట్టాలపై పడుకుని ఉన్న రమేష్ ను ఒక్కసారిగా బయటకు లాగారు. కొన్ని క్షణాలు ఆలస్యమైనా రమేష్ ప్రాణాలు దక్కేవి కావు. సిద్ధవటం పోలీసులు సకాలంలో స్పందించడం వల్లే రమేష్ ప్రాణాలు నిలిచాయి. సకాలంలో స్పందించిన ఎస్ఐకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కడప ఎస్పీ అన్బు రాజన్ అభినందనలు తెలిపారు.