Revanth Reddy: హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై సాగుతున్న వ్యవహారంలో అధికార బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గెలిచారు. ఔటర్ రింగ్ రోడ్డును ముంబాయికి చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన నేపథ్యంలో..అందులో గుడుపుఠాణి దాగి ఉందని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. మొదట్లో ఈ ఔటర్ తుట్టెను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కదిపారు. అయితే తర్వాత ఏమైందో తెలియదు గాని చప్పున చల్లారి పోయారు. వెంటన్ సీన్‌లోకి రేవంత్‌రెడ్డి ఎంటర్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని తవ్వడం మొదలుపెట్టారు. ఆ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు, దివాళా తీసిన విధానంపై వరుస విలేఖరుల సమావేశాల్లో కడిగి పారేశారు. ఇంతే కాకుండా ప్రభుత్వం ఆ ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ వ్యవహారాలను తనకు చెప్పాలని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.
రేవంత్ కోర్టుకు వెళ్లడంతో..
అయితే రేవంత్‌రెడ్డి కోరిన విషయాలను ప్రభుత్వం ఇవ్వలేదు. పైగా తమకు పనితీరును రేవంత్‌రెడ్డి తప్పుపడుతున్నారని మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ అధికారి అరవింద్‌కుమార్ ఘాటైన లేఖను రేవంత్‌కు రాశారు. అయితే ఈ వ్యవహారం వెనుక కేటీఆర్ ఉన్నారని, ప్రభుత్వ సంపదను కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో రాజకీయంగా ఎదిగేందుకు అక్కడి కంపెనీకి అంత తక్కువ ధరకు ఔటర్‌ను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. ఒకనొక దశలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్‌కు వెళ్లేందుకు యత్నించగా అక్కడి పోలీస్ సిబ్బంది రేవంత్‌ను అడ్డుకున్నారు. దీంతో రేవంత్ హైకోర్టుకు వెళ్లారు.
ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడం ఏంటి?
ఈ కేసును స్వీకరించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారిందిచింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడం ఏంటి?, ఆర్టీఐ ఉన్నది దేనికి?, ప్రతిపక్షాలకు వివరాలు ఇవ్వకపోతే వారు ఎలా మాట్లాడతారంటూ’ ప్రశ్నించింది. రెండు వారాల్లోగా రేవంత్ అడిగిన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఘాటుగా సూచించింది. ‘ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లకు సంబంధించి గత నెల 14న దరఖాస్తు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలా అయితే ఎలా?, అధికారుల తీరు ఆర్టీఐ చట్టంతో పాటు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను కూడా ఉల్లంఘించడం కూడా అవుతుందని’ హైకోర్టు వ్యాఖ్యానించింది.
అరకొర సమాచారం ఇచ్చారు
తాను మే 1న తొలిసారి దరఖాస్తు చేయగా , మే 23న అరకొర సమాచారం ఇచ్చారని అప్పట్లో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆయన జూన్ 14న మరోసారి అధికారులకు దరఖాస్తు చేశారు. ఓఆర్‌ఆర్ లీజు నివేదికలు, 30 ఏళ్లకు ఇవ్వడంపై మంత్రిమండలి నిర్ణయం, 2021-22, 2022-23 సంవత్సరాలలో ఆర్జించిన మొత్తం ఆదాయానికి సంబంధించి సమాచారం మొత్తం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. లీజు పారదర్శకంగా జరిగిందా? లేదా? అని తెలుసుకోవడానికి ఈ సమాచారం కీలకమని రేవంత్ దరఖాస్తులో పేర్కొన్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ(హెఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రజా సంబంధాల అధికారి, ఎండీ(ఎఫ్‌ఏసీ)లను రేవంత్ ప్రతివాదులు గా పేర్కొన్నారు. కాగా, ఓఆర్‌ఆర్ నిర్వహణ, టోల్ వసూళ్లు బాధ్యతలను 30 ఏళ్ల పాటు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్‌లకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్లే ఈ రచ్చంతా జరుగుతోంది.