AIIMS Rishikesh: పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే.. వారు ఉన్న ఇంటికి వెళ్తారు.. లేదా వారు ఉన్న స్థలం తెలుసుకుని వెళ్తారు. ఇక ఉగ్రవాదులు, నక్సలైట్లు అయితే.. అడవులకు వెళ్తుంటారు. దొరకకపోతే ఎన్‌కౌంటర్ కూడా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు మనం చాలా చూసే, వినే ఉంటాం. కానీ ఇక్కడ పోలీసులు విచిత్రంగా అరెస్ట్ చేశారు. ఎలా చేశారు.. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం..
ఐసీయూలోకే పోలీస్ వాహనం..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేస్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో పోలీసులు ఓ అధికారిని అరెస్టు చేశారు. ఇందుకోసం ఏకంగా పోలీస్ వాహనంతో ఐసీయూలోకే దూసుకెళ్లారు. ఆస్పత్రిలో పనిచేసే మహిళా వైద్యురాలిని అధికారి వేధిస్తున్నట్లు డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అధికారిని అరెస్టు చేయడానికి ఆస్పత్రికి వెళ్లారు. కానీ, అందరు పోలీసుల్లా ఆస్పత్రికి వెళ్లకుండా ఏకంగా పోలీస్ వాహనాన్నే ఐసీయూలోకి తీసుకెళ్లారు.
సోషల్ మీడియాలో వైరల్..
ఐసీయూ అంటే చాలా సెన్సిటివ్ ఏరియా. అందులోకి పేషెంట్ బంధువులను కూడా అనుమతించరు. కానీ, పోలీస్ వాహనం ఐసీయూలోకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. పోలీసులు ఇలా కూడా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. రోగులు ఏం కావాలనుకుంటున్నారు అని కొందరు నిలదీస్తున్నారు. అధికారం ఉందని ఇలా వ్యవహరిస్తారా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.