Bhupalpally: చట్టానికి, న్యాయానికి, ధర్మానికి మూడు సింహాలు ప్రతీకగా నిలిస్తే.. కనిపించని సింహమే పోలీస్.. పోలీస్ స్టోరీ సినిమాలో సాయికుమార్ పలికే డైలాగ్ అది. కానీ ఈ పోలీస్ ధర్మాన్ని పక్కన పెట్టాడు. నీతిని విస్మరించాడు. చట్టాన్ని తుంగలో తొక్కాడు. ఒక మహిళపై దారుణంగా ప్రవర్తించాడు. ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగింది. ఆ పోలీసు వ్యవహరించిన తీరుపట్ల తోటి ఖాకీలు ముక్కున వేలేసుకున్నారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి లో బండారి సంపత్ అనే వ్యక్తి సీఐగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడు వేకెన్సీ రిజర్వులో ఉన్నాడు మ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పనిచేశాడు. ఈ నేపథ్యంలో హనుమకొండలోని ఓ కాలనీ చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతడు ఖమ్మం జిల్లాకు బదిలీ అయినప్పటికీ ఆ మహిళతో తన సంబంధాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఖమ్మం నుంచి ఇటీవల భూపాలపల్లి ప్రాంతానికి సిఐగా బదిలీ అయ్యాడు. ప్రస్తుతం అతడు వేకెన్సీ రిజర్వులో ఉన్నాడు. అయితే సంపత్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు గతంలోనే పెళ్లయింది. సంపత్ మాయలో పడి ఆమె తన భర్తను వదిలిపెట్టింది. ఆమెకు అప్పటికే ఒక కూతురు ఉంది. ప్రస్తుతం ఆ యువతి ఇంటర్ చదువుతోంది. ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ ఖాకి అధికారి ఆమె కూతురుపై కూడా కన్నేశాడు. ఒకరోజు ఆ మహిళ ఇంట్లో లేనిది చూసి ఆమె కూతురు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లితో చెప్పింది. ఆ బాలికకు ప్రస్తుతం 16 సంవత్సరాల వయసు.
సంపత్ చేసిన నిర్వాకాన్ని తట్టుకోలేక ఆ మహిళ తన కూతుర్ని వెంటబెట్టుకొని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితురాలిని విచారించారు. పోలీసులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంపత్ అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. అతనిపై కేసు నమోదు చేశారు. అత్యాచారంతోపాటు ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. సంపత్ ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేసినప్పుడు భూ వివాదాల్లో తల దూర్చేవాడని.. అప్పట్లో ఆయనపై ఖమ్మం సీపీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే అతడిని భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు. అయినప్పటికీ సంపత్ తన తీరు మార్చుకోలేదు. తాను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ కూతురిపై అత్యాచారానికి పాల్పడి.. ఖాకీ దుస్తుల పరువు తీశాడు.