
Sandeep Sharma IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 12 ఏళ్ల కిందట అరంగేట్రం చేసిన సందీప్ శర్మ.. ఆ తర్వాత కాలంలో తన బౌలింగ్ వైవిధ్యంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. నిలకడలేమితో ఏ జట్టులోను కీలక బౌలర్ గా ఎదగలేకపోయాడు. ఒకానొక దశలో జట్టులో స్థానం కల్పించడమే కష్టమైంది. ఓ బౌలర్ గాయం.. తనకు జట్టులో స్థానాన్ని కల్పించగా.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని అద్భుత బౌలింగ్తో ఆ జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు సందీప్ శర్మ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఆడుతున్న ప్లేయర్లలో ఎక్కువ మంది ఐపీఎల్ తో వెలుగులోకి వచ్చినవారే. ఐపీఎల్ రావడానికి ముందు ఇండియా జట్టులో ఉన్న వారు కాకుండా.. ఐపీఎల్ తర్వాత ఇండియా జట్టులో చోటు సంపాదించుకున్న.. ఎంతో మందికి అవకాశాలు కల్పించింది మాత్రం ఈ లీగ్ అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి మంచి ఆటగాళ్ళలో సందీప్ శర్మ ఒకరు. బౌలింగ్ లో వైవిధ్యంతో తక్కువ కాలంలోనే మంచి బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు.
ఆ జట్లు తరపున ప్రాతినిధ్యం..
ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున సందీప్ శర్మ ఆడాడు. ఎక్కువ వేగం లేకపోయినప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ లో వైవిధ్యంతో తక్కువ కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే నిలకడ లేమి కారణంగా జట్టు అతనిపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితికి వెళ్లిపోయాడు. దీంతో గత ఏడాది ఐపీఎల్ వేలంలో అతనికి మొండి చెయ్యి ఎదురయింది. ఎవరూ కూడా ఆశించిన స్థాయిలో ధర పెట్టి కొనుగోలు చేయకపోవడంతో ఈ 29 ఏళ్ల పటియాల పేసర్ కెరీర్ ప్రమాదంలో పడిందని అంతా భావించారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా..
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా సందీప్ శర్మ ఉన్నాడు. ఆటగాడిగా జట్టులో అవకాశం వస్తుందని సందీప్ శర్మ కూడా భావించలేదు. అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ పేసర్ ప్రసిద్ధ కృష్ణ గాయం పాలు కావడంతో రాజస్థాన్ జట్టు ప్రసిద్ధి స్థానంలో సందీప్ ను తీసుకుంది. దీంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సందీప్ గొప్ప అవకాశంగా భావించాడు. చెన్నైతో జరిగిన ఈ మ్యాచ్ లో.. చివరి ఓవర్ వేసే బాధ్యతను జట్టు యాజమాన్యం అప్పగించింది. చివరి ఆరు బంతుల్లో 21 పరుగులు కావాలి. మొదటి రెండు బంతులను వైడ్ గా వేశాడు సందీప్. ఆ తర్వాత రెండు బంతులను ధోని రెండు సిక్సులుగా మలిచాడు. మరో బంతిని డాట్ చేశాడు. దీంతో మూడు బంతుల్లో ఏకంగా 14 పరుగులు ఇచ్చేశాడు. మిగిలిన మూడు బంతుల్లో ఏడు పరుగులు కావాల్సి ఉంది. అనూహ్యంగా పుంజుకున్న సందీప్ శర్మ.. తరువాత రెండు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చాడు. చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉంది. క్రీజ్ లో మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. అంతటి తీవ్ర ఒత్తిడిలోనూ సమర్థంగా యార్కర్ వేసి ఒక్క పరుగే ఇచ్చి రాజస్థాన్ జట్టును గెలిపించాడు సందీప్ శర్మ. దీంతో ఇప్పుడు సందీప్ శర్మ పేరు మార్మోగుతోంది.

నా బలమైన యార్కర్లను నమ్ముకున్న..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సందీప్ శర్మ.. ‘ యార్కర్లను సమర్థంగా వేసే నా బలాన్ని నమ్ముకున్న. నెట్ ప్రాక్టీస్ లో ఉత్తమంగా యార్కర్లు వేస్తూనే ఉన్న. మైదానంలో ఓ వైపు బౌండరీ పెద్దదిగా ఉంది. అందుకే ధోని కాళ్ళను లక్ష్యంగా చేసుకొని యార్కర్లు వేయాలనుకున్న. కానీ తక్కువ ఎత్తులో ఫుల్ టాసులు పడడంతో ధోని రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో నా వ్యూహాన్ని మార్చుకున్నా. రౌండ్ ద వికెట్ నుంచి బౌలింగ్ చేస్తూ లెంగ్త్ ను సరి చేసుకున్న. అది ఫలితాన్ని ఇచ్చింది’ అని సందీప్ శర్మ పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఒకప్పుడు మంచి బౌలర్ గా పేరు సంపాదించుకొని.. ఆ తర్వాత ఏ జట్టు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపని స్థితి నుంచి.. ఒక మంచి మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించే స్థితికి చేరడం సందీప్ శర్మకు దక్కిన అదృష్టంగానే చెప్పాలి. చూడాలి రానున్న రోజుల్లో కూడా సందీప్ శర్మకు అవకాశాలు వస్తాయో లేదో అన్నది.