
AP MLC Elections: అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధికార పార్టీ భవితవ్యం తేలబోతోంది. ప్రజల్లో ఏ మేరకు మద్దతు ఉందో స్పష్టమవ్వనుంది. సంక్షేమ పథకాల సంతృప్తి ఎంత స్థాయిలో ఉందో తేలనుంది. ప్రజల మూడ్ ఏ విధంగా ఉందో వెల్లడికానుంది. అధికార, ప్రతిపక్షాలు రెండిటికీ ఇదొక అగ్నిపరీక్ష కానుంది. ఈ ఎన్నికలు గెలిచిన వారికే అసెంబ్లీ ఎన్నికల గెలుపు నల్లేరు మీద నడక అవుతుంది. ఈ ఎన్నికే రియల్ మూడ్ ఆఫ్ ఏపీ పై క్లారిటీ ఇవ్వనుంది.
ఏపీలో తర్వలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పట్టబధ్రుల, టీచర్ల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఇప్పటికే తమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ఓటర్ల నమోదు కార్యక్రమం ఇప్పటికే పూర్తీ చేశాయి. అధికార వైసీపీ వాలంటీర్లను వినియోగించి తమకు అనుకూలంగా ఉండే వారి ఓట్లు నమోదు చేయించింది.
ప్రధానంగా రెండు పార్టీలు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయులలో అటు వైసీపీ, ఇటు టీడీపీకి పెద్దగా మద్దతు లేదు. ట్రేడ్ యూనియన్లు లేవు. కేవలం నామమాత్రంగా ట్రేడ్ యూనియన్లు ఉంటాయి. సీపీఐ , సీపీఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు బలంగా ఉన్నాయి. గెలుపోటములను ఈ రెండు పార్టీల అనుబంధ సంఘాలే నిర్ణయిస్తాయి. టీడీపీ, వైసీపీ ప్రభావం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామమాత్రమే అని చెప్పవచ్చు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల మూడ్ వెల్లడికానుంది. ఉదాహరణకు ఒక లక్ష సాధారణ ఓట్లు ఉంటే… వాటిలో ఓ వంద పట్టుభద్రుల ఓట్లు ఉన్నాయనుకుందాం. ఆ వంద మంది ఏ పార్టీకి ఎక్కువగా ఓటేస్తే ఆ పార్టీకి ప్రజల్లో మద్దతు ఉందనే విషయం వెల్లడవుతుంది. ఇప్పుడు వైసీపీ, టీడీపీకి ఈ ఎన్నికలు ఓ పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ తమను సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని నమ్ముతుంటే.. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని నమ్ముతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం పై అసెంబ్లీ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
ఉదాహరణకు మూడు సీట్లలో రెండు పార్టీలు పోటీ పడ్డాయనుకుందాం. మూడింటికి మూడు వైసీపీ గెలిస్తే.. వైసీపీ ఎలాంటి అనుమానం లేకుండా అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుంది. అదే మూడింటిలో రెండు గెలిస్తే .. ఫరవాలేదు అన్నట్టు వైసీపీ పరిస్థితి ఉంటుంది. మూడింటిలో కేవలం ఒక్క సీటు గెలిస్తే వైసీపీ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఒక్క సీటూ గెలవకపోతే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అని అంచనా వేయవచ్చు. ఇదే లెక్క టీడీపీకి కూడా వర్తిస్తుంది. టీడీపీ మూడు సీట్లు గెలిచినా.. మూడింటిలో రెండు గెలిచినా టీడీపి తిరుగుండదు. టీడీపీనే ప్రత్యామ్నాయం అంటూ ఎన్నికలకు వెళ్లొచ్చు. కేవలం ఒక్క సీటు గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో చెమటోడ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్క సీటూ గెలవలేదంటే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల మూడ్ .. కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల మూడ్ ను ప్రతిబింబిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పేలవమైన ప్రదర్శన చేస్తే జగన్ కు వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్ష అని చెప్పవచ్చు. గెలుపు తీరాలను చేరుకోవడం చాలా కష్టమని చెప్పవచ్చు. అందుకే అటు వైసీపీ, ఇటు టీడీపీ సర్వశక్తులు వడ్డుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ప్రజల మద్దతు తమకే ఉందన్న సంకేతం ఇవ్వడానికి తహతహలాడుతున్నాయి.