
Automatic Transmission Cars: నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు చెప్పనలవి కాదు. అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి ఉండదు. కిలో మీటర్ దూరం కూడా గంట సేపు ప్రయాణించిన సందర్భాలు ఉంటాయి. ట్రాఫిక్ మధ్యలో గంటల కొద్దీ ఇరుక్కుపోయిన సందర్భాలు కోకొల్లలు. ఈ గజిబిజీ ట్రాఫిక్ లో గేర్లు మార్చడం మరొక తలనొప్పి. పదే పదే గేర్లు మార్చుతూ ట్రాఫిక్ లో వాహనం నడపడం ఓ పెద్ద సవాలు.. అయితే ఈ సమస్యకు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్ల రూపంలో పరిష్కారం దొరకింది. నగరవాసుల ఇక్కట్లకు ఇక ఫుల్ స్టాప్ పడనుంది.
కార్ల విషయంలో వినియోగదారుల మూడ్ మారుతోంది. ఇన్నాళ్లు మాన్యువల్ కార్లంటే జనం తెగ మోజు చూపించేవారు. ఇప్పుడు వినియోగదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. మాన్యువల్ కార్ల స్థానంలో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీనికి కారణం ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లలో ఉన్న సదుపాయమే. ఆటోమేటిక్ కార్లు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. ఈ కార్లలో పదే పదే గేర్లు మార్చే పని ఉండదు. ట్రాఫిక్ లో గేర్లు మార్చుతూ ఇబ్బంది పడే అవసరం ఉండదు. దీంతో ఆటోమేటిక్ కార్లంటే వినియోగదారుల్లో క్రేజ్ భారీగా పెరిగింది.
సహజంగా మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్ల ధరలు అధికంగా ఉంటాయి. కొత్త వర్షన్ కావడం, అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించడం కారణంగా ఆటోమేటిక్ కార్ల ధరలు ఎక్కవగా ఉంటాయి. అయితే.. ఇప్పుడు సరసమైన ధరల్లోనే ఆటోమేటిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 11 లక్షల ఆటోమేటిక్ కార్లలో ఉండే ఫీచర్లు రూ. 6 లక్షల ఆటోమేటిక్ కార్లలో కూడా వస్తున్నాయి. ఇది సగటు వినియోగదారుడికి శుభవార్త అని చెప్పవచ్చు.

తక్కువ ధరలో వస్తున్న ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లలో మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్, హుండాయ్ శాంత్రో కార్ల బ్రాండ్లు ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూమ్ ధర రూ. 6 లక్షల కంటే తక్కువగా ఉంది. మారుతీ సుజుకి కార్లు 21.7 కెఎంపీఎల్ మైలేజిని ఇస్తే.. రెనాల్డ్ క్విడ్ కార్లు 22.0 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తున్నాయి. శాంత్రో 20.3 కెంపీఎల్ మైలేజిని ఇస్తోంది. శాంత్రో 1086 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. 68.05 హెచ్పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ కార్లన్నీ కూడా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కార్లే. రూ. 11 లక్షల కార్లలో ఏవైతే ఫీచర్లు ఉంటాయో.. రూ. 6 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలో లభిస్తున్న కార్లలో అవే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్ల పైనే ప్రజల మక్కువ పెరిగింది.