
Pawan Kalyan Delhi Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా బిజెపి అగ్ర నేతలు అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. తాజా భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. గత 15 రోజులు సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాగా, తాజాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది.
ఎన్నికల ఏడాది కావడంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ రెండుసార్లు ఢిల్లీ బాట పట్టగా.. ఆ తర్వాత ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పలు అంశాలపై చర్చించేందుకు పవన్ ఇద్దరు కీలక నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
అమిత్ షా.. నడ్డాతో భేటీ..
ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపిలోని ఇద్దరు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. వీరిలో ఒకరు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కాగా, రెండో వ్యక్తి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. వీరిద్దరితో సమావేశం అయిన తర్వాత పలు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ లో ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తాజా ఢిల్లీ టూర్ నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు రాష్ట్రంలో చోటుచేసుకుంటాయన్న చర్చ జోరుగా సాగుతోంది. మరి ముఖ్యంగా కొద్దిరోజుల నుంచి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం, ఆకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తిని కలిగిస్తోంది.
తెరపైకి వచ్చిన రోడ్డు మ్యాప్ అంశం..
గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మిత్రపక్షంగా ఉన్న బిజెపి రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామంటూ పేర్కొన్నారు. తాజా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఇప్పుడు ఆ అంశం బయటకు వస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలపై వైసీపీ చేస్తున్న దాడులకు సంబంధించిన అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో వైసిపి చేస్తున్న అఘాయిత్యాలను కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఇరువురితో భేటీ నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. గతంలో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించిన పవన్.. ఇప్పుడు ఆ అంశంపై అమిత్ షా నడ్డాతో చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
పొత్తు నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం..
మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తులో ఉన్నామని చెబుతూ వచ్చారు. అయితే టిడిపి తో పొత్తుకు సంబంధించి సానుకూలంగానూ అనేకసార్లు మాట్లాడారు. అయితే ఈ సమావేశం అనంతరం జనసేన పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉంటుందనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ కు లభించే సానుకూలమైన అంశాలను బట్టి పొత్తు నిర్ణయం ఉండే అవకాశం కనిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు విషయంపై బీజేపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నుంచి సరైన సహకారం అందడం లేదని పలువురు బిజెపి నాయకులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బిజెపి అగ్ర నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది.

ప్రధానితో భేటీకి అవకాశం..
హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోను పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి అధికారక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఇప్పుడు ఢిల్లీ పర్యటన వెనక, బిజెపి అగ్ర నాయకులతో సమావేశం వెనుక మరో కీలకమైన అంశం దాగి ఉందని చెబుతున్నారు. ఇదే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా కాంగ్రెస్ పార్టీ, బిజెపి హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా ఉన్న నేపథ్యంలో బిజెపి సినిమా హీరోలను దువ్వే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, చరణ్ తేజ్, ప్రభాస్ తో బిజెపి నాయకుల పలు సందర్భాల్లో సమావేశాలయ్యారు. ఈ సమావేశాల వెనుక కారణాలు అనేకం ఉన్నప్పటికీ.. బిజెపి అంతిమ లక్ష్యం మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వీరి నుంచి కొంత లబ్ది పొందాలని భావిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిపించడం వెనక ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అంశం కూడా దాగి ఉండవచ్చు అని నిపుణులు మాట. ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ చేసే ప్రకటన, జనసేన నాయకులు చేసే మాటలను బట్టి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.