
Pawan Kalyan- BJP: రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. మొన్నటి వరకు టిడిపి – జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు వెళతాయని అంతా భావించారు. అయితే, అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో రాజకీయాలు ఒక్కసారిగా రాష్ట్రంలో మారిపోయాయి. బిజెపి అగ్ర నాయకులతో సమావేశం తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు అంశం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వైసిపి ముందుకు సాగుతుంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలని జనసేన – టిడిపి భావిస్తూ వచ్చాయి. సీట్ల పంపకానికి సంబంధించిన చర్చలు ముగిశాయని, కొద్దిరోజుల్లోనే ఈ మేరకు ఉమ్మడి ప్రకటన వెలబడుతుందని అంతా భావించారు. అయితే అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో పొత్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
పవన్ ఢిల్లీ టూర్ తో మారిన రాజకీయ సమీకరణాలు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన మూడు రోజులపాటు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా బిజెపి నేతలను కలిశారు. భారతీయ జనతా పార్టీని గతంలో రూట్ మ్యాప్ అడిగిన పవన్ కళ్యాణ్ కు.. అప్పట్లో బీజేపీ నాయకులు ఎటువంటి రూట్ మ్యాప్ ఇవ్వలేదు. కొద్దిరోజుల కిందట ఢిల్లీకి రావాలని బిజెపి నాయకులు నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వెళ్లిన పవన్ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు ముఖ్య నాయకులను కలిసి చర్చలు జరిపారు. బిజెపి అగ్ర నాయకులతో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, ఆయన పొత్తులకు సంబంధించిన అంశాలను అక్కడ ప్రస్తావించలేదు. కానీ, బిజెపి నాయకులతో సమావేశం అనంతరం ఆయన మౌనం దాల్చడంతో టిడిపితో పొత్తు దాదాపు తెగదెంపులు అయినట్లే అని పలువురు చెబుతున్నారు. ఎన్నికల్లో బిజెపితో కలిసి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని, అందుకే తాజాగా టిడిపితో పొత్తు విషయంగానీ, ఇతర అంశాలపై మాట్లాడేందుకు అంగీకరించడం లేదన్న చర్చ జోరుగా నడుస్తోంది.
జనసేనకు భారీగా పెరిగిన ఓటు బ్యాంకు..
గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆరు శాతం ఓట్లు పడ్డాయి. కానీ గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు దృష్ట్యా జనసేన పార్టీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించారు. వారంతా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ కి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు 12 శాతం ఓటు బ్యాంకు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్తుతం రాష్ట్రంలో 10 నుంచి 12 శాతం ఉంది. ఇందులో టిడిపికి సగం, జనసేనకు సగం వచ్చిన.. జనసేన పార్టీ మొత్తం ఓటు బ్యాంకు ఇంచుమించుగా 17 నుంచి 18 శాతానికి పెరుగుతుంది. ఈ స్థాయిలో ఓటు బ్యాంకు కలిగిన జనసేన పార్టీని తమతో పాటు కలిపి తీసుకెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అని టిడిపి భావిస్తోంది. అందులో భాగంగానే పొత్తు కోసం టిడిపి తీవ్రంగానే ప్రయత్నాలు సాగిస్తోంది.
మౌనం వెనక కారణం ఏమిటి..?
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మౌనం దాలుస్తు వస్తున్నారు. ఈ మౌనం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. బిజెపి అగ్ర నాయకులతో సమావేశం తర్వాత రాష్ట్రంలో పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ పునరాలోచన చేసినట్లు చెబుతున్నారు. టిడిపి – బిజెపి – జనసేన కూటమి కోసం పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే బిజెపి అగ్ర నాయకులు మాత్రం జనసేన – బిజెపి కూటమిగా వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి వెళ్లాలన్న ఆలోచన నుంచి వెనక్కి వచ్చి.. బిజెపితో వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడి స్పష్టత ఇచ్చేంత వరకు దీనిని ధ్రువీకరించలేమని పలువురు చెబుతున్నారు.

పవన్ కోరిక నెరవేరే అవకాశం ఉందా.. ?
బిజెపి ముఖ్య నాయకులు చెప్పినట్లు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కాకుండా జనసేన – బిజెపి కూటమిగా వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయా అన్న దానిపైన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. టిడిపితో కలిసి వెళ్లడమే మంచిది అన్న భావన ఆ పార్టీ కీలక నాయకుల్లో వ్యక్తం అవుతుంది. విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి లభిస్తుందన్న భావన పవన్ కళ్యాణ్ లో ఉంది. గౌరవ స్థాయిలో సీట్ల పంపకం, అధికారంలో భాగం ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ డిమాండ్. అయితే, దీని పట్ల టిడిపి సానుకూలతను వ్యక్తం చేయడం లేదు. దీంతో, పవన్ కళ్యాణ్ బిజెపితో వెళితే బాగుంటుందా..? టీడీపీ తో కలసి వెళ్లడం వల్ల మేలు కలుగుతుందా..? అన్న అంశాలను బేరీజు వేసుకొని కొద్ది రోజుల్లోనే రాజకీయ పొత్తులపై పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో బిజెపితోగాని, టిడిపి తో గాని పొత్తు కుదరలేదు అన్న విషయాన్ని మాత్రం ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.