
Pawan Kalyan: ఇటీవల ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు. మధ్యలో తెలంగాణ ప్రజలపై ఏపీ మంత్రి ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ రియాక్టయ్యారు. రాజకీయ విమర్శలు చేసుకోండి కానీ.. మధ్యలో ప్రజలు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులను సీఎం జగన్ కట్టడి చేయాలని కూడా సూచించారు. అయితే పవన్ మాటలను ఏపీ మంత్రులు తప్పుపట్టారు. ఏదో ప్రయోజనం కోసమే పవన్ కొత్త పల్లవి అందుకున్నారని.. బీఆర్ఎస్ తో కొత్త సంబంధాలు నెరుపుతున్నారని ఆరోపించారు.
ఏపీ మంత్రుల ఎదురుదాడి..
పవన్ వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు సైతం ఆహ్వానించారు. ఆయన బాధ్యతాయుతమైన ప్రకటన చేశారని అభినందిస్తున్నారు. అయితే ఇందులో ఏం తప్పుందో తెలియదు కానీ.. వైసీపీ మంత్రులు పవన్ పై ఎదురుదాడికి దిగారు. ఏపీ మనోభావాలపై తాము మాట్లాడుతుంటే పవన్ తెలంగాణ మంత్రులకు సపోర్టు చేస్తున్నారని విమర్శలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ పై అంత ప్రేమ ఎందుకో అంటూ కొత్త అనుమానాలకు తెరతీశారు. పవన్ బీఆర్ఎస్ తో కలిసి నడవబోతున్నారని కొత్త ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో సైతం తప్పుడు ప్రచారం ప్రారంభించారు. పవన్ స్థాయిని దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
భావోద్వేగాల రాజకీయం..
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల విషయంలో ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ రాష్ట్రాల కోసం గట్టిగానే ఫైట్ చేస్తున్నామని ప్రజల్లోకి సంకేతాలు పంపి రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందుకే పవన్ సరైన టైమ్ లో ఎంటరయ్యారు. అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప.. ప్రజలను తిడితే ఏం వస్తుందని ప్రశ్నించారు.

విభజన ముందు ఇలాగే..
రాష్ట్ర విభజనకు ముందు కూడా నేతలు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ప్రజల్లో బలమైన ఆకాంక్షను, ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించేవారు. కానీ అప్పట్లో ప్రాంతీయ వాదం అనివార్యం. కానీ ఇప్పుడు ఎవరి రాష్ట్రాలు వారివి. ప్రజలు కోరుకున్న ప్రభుత్వాలు వచ్చాయి. పాలన కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో అభివృద్ధిలో పోటీపడాలే తప్ప.. ఇలా ప్రజలను తిట్టుకోవడం సహేతుకమైన చర్య కాదు. రాష్ట్రాలు వేరుపడినా ప్రజలు మాత్రం మంచి వాతావరణంతో మెలుగుతున్నారు. ఇటువంటి తరుణంలో నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కానీ ఆయన మాటలను ఇష్టపడని ఏపీ మంత్రులు మాత్రం అదే పనిగా విమర్శిస్తున్నారు. విశ్లేషకులు మాత్రం పవన్ సరైన టైమ్ లో రియాక్టయ్యారని.. బాధ్యతగా వ్యవహరించాని అభినందిస్తున్నారు.