James Cameron Avatar 3: జేమ్స్ కామెరూన్ మెదడులో అవతార్ అనే బీజం పడటానికి భారతీయ పురాణాలే కారణం. ఈ విషయాన్ని పార్ట్ 1 విడుదల కాకముందే జేమ్స్ కామెరూన్ ఒప్పుకున్నారు. అవతారం అనేది హిందూ పురాణాల్లోని పదమే. దేవుడి మరో రూపాన్ని మనం అవతారం అంటాము. ఆ విధంగా అవతార్ అనే టైటిల్ ని కామెరూన్ ఎంచుకున్నారు. టైటిల్ మాత్రమే కాదు… అవతార్ సిరీస్ మొత్తానికి హిందూ సంస్కృతి మూలం అనిపిస్తుంది. భారతీయులు పంచభూతాలు గా చెప్పుకునే గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశాలు కథావస్తువులుగా కామెరూన్ అవతార్ సిరీస్ తీస్తున్నారనిపిస్తుంది. ప్రకృతిని కాపాడుకోవడం మనిషి బాధ్యత. నేచర్ బాగున్నంత కాలమే మనిషి మనుగడ ఉంటుంది.

ఆ బాధ్యత మరచిన మనిషి భూగ్రహం నాశనం చేశాడు. అది చాలదన్నట్లు తన స్వార్థం కోసం ఇతర గ్రహాలను అక్కడి జాతులను కబళించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కామెరూన్ అవతార్ సిరీస్ స్టోరీ లైన్. ఇక పంచభూతాల ఆధారంగా ఒక్కొక్క సిరీస్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్నారు. మూడో భాగం ఎలా ఉంటుందో ఆయన నేరుగా వివరించారు. దీంతో పూర్తి క్లారిటీ వచ్చేసింది. బెస్ట్ విజువల్స్ విభాగంలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు అవతార్ 2 గెలుచుకుంది. ఈ సందర్భంగా జేమ్స్ కామెరూన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అగ్ని ఒక చిహ్నం, మానవాళికి మనుగడకు అవసరమైంది. అవతార్ 3 అగ్ని ప్రధాన ఇతివృత్తంగా సాగుతుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదేమో. అవతార్ 2 లో మరో రెండు తెగలను మీకు పరిచయం చేస్తున్నాము. ఒమక్టయా, మెట్కైనా అనే తెగలను మీరు కలుసుకుంటారు. పాండోరాలో ఇది ఒక భిన్నమైన ప్రదేశం, అని వెల్లడించారు. కాగా మొదటి పార్ట్ లో భూమి కోసం మనుషులకు వ్యతిరేకంగా నావీ తెగ యుద్ధం చేసింది. పార్ట్ 2 లో నీటిలో తమ జాతులను, జీవాలను కాపాడుకునేందుకు పోరు సాగించారు.

పార్ట్ 3లో అగ్ని కోసం వారు యుద్ధం చేయనున్నారని కామెరూన్ చెప్పకనే చెప్పారు. పార్ట్ 3 పాండోరా గ్రహంలోని ఎడారి ప్రాంతంలో సాగుతుందట. ఎడారి వేదికగా జేక్ సల్లీ ఫ్యామిలీ యుద్ధం సాగిస్తుందని హాలీవుడ్ వర్గాల బోగట్టా. పార్ట్ 2 తో పాటే పార్ట్ 3 చిత్రీకరణ పూర్తి చేశారు. రానున్న రెండేళ్లలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి 2024 డిసెంబర్ లో విడుదల చేస్తారట. కాబట్టి అవతార్ పార్ట్ 2 చూడాలంటే మరో రెండేళ్లు ఎదురు చూడాలి. అవతార్ విడుదలైన 13 ఏళ్లకు అవతార్ 2 విడుదలైన సంగతి తెలిసిందే.