Jagan-Pawan Kalyan : ఆయన పార్టీ పెట్టి పట్టుమని పదేళ్లయింది. పోటీ చేసింది మాత్రం ఒక్క ఎన్నికలోనే. కానీ అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గెలిచింది ఒక్క సీటే అయినా ..అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేతను మించి టార్గెట్ అయ్యారు. ఆయన నామస్మరణ చేయనిదే అధికార పార్టీకి ముద్ద దిగదు. ముఖ్యమంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆయనెవరో కాదు జనసేనాని పవన్ కళ్యాణ్. జగన్ కు సింగిల్ టార్గెట్ అయ్యారు.

చంద్రబాబు దాదాపు 15 ఏళ్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్లు ప్రతిపక్ష నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత. అసెంబ్లీ లోపల, బయట ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష నేతే టార్గెట్ అవుతారు. కానీ ఏపీలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష నేతను వదిలి పవన్ కళ్యాణ్ వెంట పడుతోంది వైసీపీ. దీని ప్రత్యేక కారణం లేకపోలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ గెలిచింది. టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పోరాటానికి ప్రజల్లో పెద్దగా విశ్వసనీయత లేకుండాపోయింది. దీనికి కారణం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉండటం. ఆయన పాలన ప్రజలు చూడటం. దీంతో ప్రజల్లో టీడీపీ చేస్తున్న ఆరోపణల పైన, పోరాటాల పైన పెద్దగా మద్దతు కనపడలేదు. దీంతో జగన్ కూడా చంద్రబాబును పెద్దగా పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు విమర్శలను తేలిగ్గా కొట్టిపారేస్తూ వచ్చారు.
పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే సాధించారు. ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీతో అంటకాగడం మొదలెట్టారు. పవన్ ఎప్పుడైతే ప్రజా సమస్యల పై పోరాటం మొదలు పెట్టారో వైసీపీలో చలనం వచ్చింది. పవన్ మాటలను ప్రజలు నమ్మడం మొదలు పెట్టారు. పవన్ కు ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను గుర్తించిన వైసీపీ.. పవన్ ఎలాగైనా బద్నాం చేయాలని కంకణం కట్టుకుంది. పవన్ జోరుకు అడ్డుకట్ట వేయకపోతే దెబ్బతింటామని భావించి పవన్ పై ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు మొదలుపెట్టింది. ప్యాకేజీ స్టార్ అనే విమర్శను ఎలాగూ నిరూపించలేరు. కాబట్టి కేవలం బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం మొదలు పెట్టారు. పవన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ గోబెల్స్ ప్రచారం ఇంకా ముమ్మరం చేసింది.
పవన్ తో ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే కూడ లేరు. అయినా జగన్ పవన్ టార్గెట్ చేయడానికి కారణం.. పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న విశ్వసనీయత. పవన్ చెబితే ప్రజలు నమ్ముతారని వైసీపీ భావిస్తోంది కాబట్టి విమర్శలు చేస్తోంది. చంద్రబాబును వదిలి పవన్ తమ సింగిల్ టార్గెట్ అన్నట్టు వైసీపీ పవన్ వెంట పడుతున్నారు… పవన్ ఏపీ ప్రజల మూడ్ ను మారుస్తున్నారన్న భయమే జగన్ టార్గెట్ చేయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కారణమైందన్న ప్రచారం సాగుతోంది.