Pakistan pacer Naseem Shah: జీవితంలో మనకు ఇష్టమైనవి దూరం అయితే ఆ బాధ వర్ణనాతీతం. అది వస్తువైనా.. మనవాళ్లు అయినా.. ప్రాణమైనా అంతే. మనకు అమితంగా ఇష్టం అనుకున్నవి త్వరగా దూరం అవుతాయి. మనం ఎన్నో సినిమాల్లో చూస్తాం. నిజ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు మనకు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాలంటే ఎంతో పట్టుదల, శ్రమ ఉండాలి. దాని కోసం అహర్నిశలు శ్రమించాలి. దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ అవకాశం కొద్ది మందికే దక్కుతుంది.

అలాంటి స్థాయికి వెళ్లిన వారికి తమ తల్లిదండ్రులు కూడా తన తొలి మ్యాచ్ చూడాలని కోరుకుంటారు. అలాంటి అదృష్టం అందరికి రాదు. తన మ్యాచ్ ను అమ్మ చూడాలి అని కోరుకున్న ఆ క్రికెటర్ కోరిక మాత్రం తీరలేదు.
కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. తన తొలి మ్యాచ్ ను అమ్మ చూడాలని ఆశ పడ్డాడు. ఆ ముందు రోజు అమ్మ ఫోన్ చేస్తే ఇదే విషయం చెప్పాడు. ‘అమ్మ నేను అంతర్జాతీయ క్రికెట్ కు ఎంపికయ్యానని.. రేపు తన మ్యాచ్ చూడాలని’’ సూచించాడు. దీంతో అమ్మ సరేనంది. కానీ ఆమె మ్యాచ్ చూడలేకపోయింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడికి తెలిసింది అమ్మ చనిపోయిందని. దీంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. పాకిస్తాన్ యువ పేసర్ నసీమ్ షా తన నిజ జీవితంలో జరిగిన విషాదాన్ని పంచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.

అమ్మ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. కానీ తన మ్యాచ్ ను అమ్మ చూడలేకపోవడంతో తట్టుకోలేకపోయాడు. నసీమ్ షా 12 ఏళ్ల వయసులోనే క్రికెట్ కోసం ఇల్లు వదలాల్సి వచ్చింది. లాహోర్ కు షిఫ్ట్ అయి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ తన కష్టం అమ్మ చూసి సంతోషిస్తుందని అనుకున్నా అతడి కోరిక నెరవేరలేదు. తరువాత ఏడెనిమిది నెలలు జీవితంలో అత్యంత కఠినమైన రోజులు గడిపాడు.
2003లో పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతమైన ఖబర్ పంక్తువాలో జన్మించిన నసీమ్ షా 16వ ఏట పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. 2019లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా వెళ్లగా అడిలైడ్ లో టెస్టులో రంగప్రవేశం చేశాడు. టీ20లలో ఆసియా కప్ లో భారత్ మీద తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు 13 టెస్టులు, మూడు వన్డేలు, 16 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 38, వన్డేలలో 10, టీ20లలో 14 వికెట్లు తీశాడు. భవిష్యత్ లో మరింత పదునైన బౌలర్ గా రాణించి మరిన్ని రికార్డులు సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు