Oxana Malaya: టార్జాన్.. మోగ్లీ కథలు మనకు సుపరిచితమే. అయితే అవి నిజమో, కల్పితమో ఇప్పటికీ తెలియదు. అయితే నిజ జీవితంలో అలాంటి మనుషులను ఎవరూ చూసి ఉండరు. కనీసం అలాంటి వారి కథలు కూడా విని ఉండరు. కానీ ఉక్రెయిన్ ప్రాంతంలో ఒక టార్జాన్ విమెన్ ఉంది. కాకపోతే ఆమె జీవితంలో అన్నీ విషాద కోణాలే.
ఉక్రెయిన్ లో ఆక్సానా మలయా అనే 40 సంవత్సరాల మహిళ ఉంది. రూపానికి మహిళ అయినప్పటికీ ఆమె వ్యవహరించే తీరు శునకం లాగే ఉంటుంది. వాటి మధ్య పెరగడం, తినడం వల్ల ఆమెకు మొత్తం శునకం లక్షణాలు వచ్చాయి. ఆమె వ్యవహరించే తీరు.. అచ్చం శునకం లాగే ఉంటుంది. ఆక్సానా మలయా అందరిలాగానే పుట్టింది. కానీ ఆమె తల్లిదండ్రులు మద్యానికి బానిసలు కావడంతో ఆమె బాగోగులు పట్టించుకోలేదు. ఆమెకు మూడు సంవత్సరాల వయసున్నప్పుడు మద్యం మత్తులో గజగజ వణికించే చలిలో బయటపడేసి వారు మాత్రం ఇంట్లోకి వెళ్లిపోయారు. ఆ చలికి ఏం చేయాలో తెలియక ఆక్సానా మలయా కుక్కల బోనులో తలదాచుకుంది. కుక్కల బోనులో ఉన్నప్పటికీ కూతురు గురించి ఆ తల్లిదండ్రులు వాకబు చేయలేదు. ఆమె గురించి వెతకను కూడా వెతకలేదు. కొన్ని రోజులకు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇలా తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆక్సానా మలయా కుక్కలే లోకంగా పెరిగింది. ఆ కుక్కలే ఆమెకు ఆత్మీయుల్లాగా మారిపోయాయి. కుక్కలతో కలిసిపోయిన ఆక్సానా మలయా తీరును చూసి బాధపడిన చుట్టుపక్కల వారు.. ఆమెను అక్కడి నుంచి బయటికి పంపియడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఆమెను ఆ బోను బయటికి తీసుకెళ్తే కుక్కలు ఊరుకునేవి కాదు.
ఆక్సానా మలయా శునకం లాగా మొరగడంతో ఆమెతో సంభాషించే వీలు స్థానికులకు లేకుండా పోయేది. దీంతో వారు అధికారులకు సమాచారం అందిస్తే.. వారు ఆమెను కాపాడేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ కుక్కల నుంచి ఆ అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తే అవి అధికారులపై దాడి చేశాయి. చివరి ప్రయత్నం గా కుక్కలకు ఆహారాన్ని ఎరగా వేసి వాటి బారి నుంచి ఆ అమ్మాయిని రక్షించారు. ఆ తర్వాత ఆ బాలికను ఫోస్టర్ హోం నకు పంపించారు. ఆ తర్వాత అక్కడ సిబ్బంది ఆమెకు శిక్షణ ఇవ్వడంతో కాళ్లపై నడవడం, సంభాషించడం నేర్చుకుంది. కుక్కల మధ్య చాలా సంవత్సరాల వరకు ఉండటంతో వాటి లక్షణాలను పూర్తిగా ఆక్సానా మలయా మానుకోలేకపోయింది.
ఆమెను పరీక్షించిన వైద్యులు మానసిక స్థితి ఇంకా ఆరు సంవత్సరాల పాపలానే ఉందని తేల్చారు. ఆమె ఎప్పటికీ చదవలేదని స్పష్టం చేశారు. ఎందుకంటే ఐదు సంవత్సరాలలోపు భాష నేర్చుకోకపోతే చదవడం అనేది కష్టమవుతుంది. ఆక్సానా మలయా 2000 సంవత్సరంలో తనను నిర్ధాక్షిణ్యంగా విడిచి వెళ్లిపోయిన తల్లిదండ్రులను కలుసుకుంది. తమ కూతురిని విడిచిపెట్టి తప్పు చేశామనే భావనో, ఇద్దరం విడిపోయామనే అపరాధ భావమో తెలియదు గాని ఆ కుటుంబం ఇప్పుడు అంతా ఒకచోటకు చేరింది. అయితే ఉక్రెయిన్ దేశంలో ఆక్సానా మలయా లాంటి సంఘటనలు ఇంతవరకు చోటు చేసుకోలేదని అక్కడి అధికారులు ప్రకటించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు 100 వరకు ఉంటాయని.. అందులో ఆక్సానా మలయా ఒకటని వారు వివరించారు.