Homeఎంటర్టైన్మెంట్OTT: ఓటీటీ లెక్కలు మారాయి: చిన్న నిర్మాతలకు పెద్ద దెబ్బ

OTT: ఓటీటీ లెక్కలు మారాయి: చిన్న నిర్మాతలకు పెద్ద దెబ్బ

OTT: చిన్న నిర్మాతలకు థియేటర్లు పెద్దగా దొరకవు. ఒకవేళ దొరికినా అది అన్ సీజన్ అయి ఉంటుంది. ఒకవేళ సినిమా హిట్ అయినప్పటికీ 10 నుంచి 15 రోజుల వరకే ప్రదర్శితమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక సర్దుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎంతో కొంత ఆదాయం శాటిలైట్, ఓటీటీ రూపంలో వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు కూడా చిన్న నిర్మాతలు తమ సినిమాలకు థియేట్రికల్ గా పెద్దగా డబ్బులు రాకపోయినా, ఓటీటీ రూపంలో గిట్టుబాటు అవడంతో భారీగా సినిమాలు తీశారు. ఓటీటీ తారాజువ్వ లాగా ఎగిసి పడిన నేపథ్యంలో ఇది మంచి విధానం కాదంటూ అప్పట్లో ట్రేడ్ పండితులు హెచ్చరించారు. అని ఇప్పుడు అదే జరుగుతోంది. వాస్తవం ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో చిన్న నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

OTT
OTT

ఆచితూచి

మొన్న విడుదలైన మంచు విష్ణు జిన్నా సినిమా కొనేందుకు అమెజాన్ ప్రైమ్ అంతగా ఆసక్తి చూపలేదు. నితిన్ మాచర్ల నియోజకవర్గం పరిస్థితి కూడా ఇంతే.. వాస్తవానికి మొన్నటివరకు ప్రతి సినిమాను ఓటీటీ సంస్థలు ఎగబడి కొన్నాయి.. ఇప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలను మరీ చిన్నచూపు చూస్తున్నాయి.. ఇటీవల కాలంలో 50 చిన్న సినిమాలు ఓటిటి స్ట్రీమింగ్ కు నోచుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ నిర్మాతల వరకు ఓటీటీ అంటే అమెజాన్ మాత్రమే. ఈ సంస్థ ఒక్కటే కనిపించిన ప్రతి సినిమాను కొనేది.. చిన్న నిర్మాతలు కొన్నాళ్లపాటు పండగ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ పరిస్థితి బాగోలేదు.. దీని మాతృ సంస్థ అమెజాన్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఇందుకు ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యమే కారణం. దీంతో అమెజాన్ ప్రైమ్ చిన్న సినిమాలు కొనడం మానేసింది. ఎంతో హైప్ ఉంటే తప్ప స్ట్రీమింగ్ కు అనుమతి ఇవ్వడం లేదు.. దీంతో చిన్న నిర్మాతలు ఆందోళనలో పడిపోయారు.

ధరలు సవరించారు

గతంలో ప్రతి సినిమాను అమెజాన్ ప్రైమ్ ఔట్ రేటు కు కొనుగోలు చేసేది.తర్వాత పే ఫర్ వ్యూ పద్ధతిలోకి మారింది.. అంటే గంటపాటు ఒక సబ్స్క్రైబర్ సినిమా చూస్తే ₹4.50 పైసలు ఇవ్వడం మొదలుపెట్టింది.. అదే డబ్బింగ్ సినిమా అయితే ₹2.50 ఇవ్వడం మొదలుపెట్టింది.. అమెజాన్ కు భారీ స్థాయిలో సబ్స్క్రైబర్లు ఉండటంవల్ల నిర్మాతలకు మంచిగానే గిట్టుబాటయింది.. అక్కడిదాకా ఎందుకు ఆది సాయి కుమార్ వంటి హీరోలతో సినిమా తీసే చిన్న నిర్మాతలు ఈ విధానంతో బాగానే లాభ పడ్డారు. అయితే ఇప్పుడు ఈ విధానంలో చిన్న సినిమాలకు స్ట్రీమింగ్ ఇచ్చేందుకు అమెజాన్ నిరాకరిస్తున్నది.

పద్ధతి పాడు లేదు

అమెజాన్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఇదే బాట పట్టింది.. గంటకు ఇంత అనే పద్ధతిలోకి మారింది. అయితే అమెజాన్ స్ట్రీమింగ్ లో పెడితే వచ్చే దాంట్లో సగం కూడా హాట్ స్టార్ లో రావడంలేదని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ఇక మొన్నటిదాకా అమెజాన్ ప్రైమ్ తో పోటీగా సినిమాలు కొన్న హాట్ స్టార్ ఇప్పుడు గంటకు నాలుగు రూపాయల పద్ధతిలోకి మారింది. దాన్ని కూడా సవరించి రెండు రూపాయలు మాత్రమే ఇస్తానంటోంది.. కొన్ని సినిమాలకు రూపాయిన్నర మాత్రమే ఇచ్చే యోచన లో ఉంది. ఇలా చేస్తే నిర్మాతకు ఒక నెలలో రెండున్నర లక్షల కు మించిరావు. ఇక మిగతా ఓటీటీలు నెట్ ఫ్లిక్స్, జీ 5 ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో చాలా తక్కువ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి..జీ5 ఎప్పుడు ఏ సినిమా కొంటుందో తెలియదు.

OTT
OTT

గోటి చుట్టూ రోకటి పోటు

ఈ పరిణామంతో చిన్న నిర్మాతల పరిస్థితి గోటి చుట్టూ రోకటి పోటు లా సామెత మాదిరి మారింది. ఒకవేళ చిన్న సినిమాలు బాగున్నప్పటికీ ప్రేక్షకులు ఇల్లు కదిలి థియేటర్ వైపు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ దోపిడీ మామూలుగా ఉండటం లేదు.. తక్కువలో తక్కువ ఒక కుటుంబం సినిమాకి వెళ్లాలంటే 1000 నుంచి 1500 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరోవైపు ఓటీటీ లు కూడా చిన్న సినిమాలను దారుణంగా చూస్తున్నాయి. స్ట్రీమింగ్ కు అసలు అనుమతి ఇవ్వడం లేదు.. దీనివల్ల కొంతమంది నిర్మాతలు థియేటర్లలో సినిమాలను విడుదల చేయకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు వాటికి కూడా నోచుకోవడం లేదు.. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో చిన్న సినిమాలు అనేవి ఉండవు. చిన్న నిర్మాతలు అనేవారు అసలు ఉండరు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular